దండించకుండా మన్నించండి.. కాళ్ల బేరానికి ఖాకీలు!
Publish Date:Jul 20, 2024
Advertisement
అడుసు తొక్కనేల.. కాలు కడగనేలా అన్న సామెత ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘానికి అతికినట్లుగా సరిపోతుంది. తాము పోలీసులమన్న విషయాన్నే మరిచి అచ్చంగా వైసీపీ కార్యకర్తలలాగే వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులు, పోలీసులను కనీసం మందలించడానికి కూడా సాహసించని పోలీసు అధికారుల సంఘం.. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తప్పు చేశాం మన్నించండి అంటూ కాళ్లావేళ్లా పడుతోంది. గతంలో జరిగిన వన్నీ మరిచిపోండి.. ఇప్పుడు అచ్చమైన పోలీసుల్లా పని చేస్తాం. ఎవరైనా గీత దాటితే తాట తీయండి అంటూ బతిమలాడుకుంటోంది. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ పోలీసు అధికారి వర్ల రామయ్యను కలిసి క్షమాపణలు చెప్పిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిథులు ప్రభుత్వం తమపై కన్నెర్ర చేయకుండా చూడండి అంటూ వేడుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసు అధికారు సంఘం గతంలో పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీకి ఊడిగం చేయడానికి అప్పటి ప్రభుత్వ ఒత్తిడే కారణమని ఇప్పుడు చెబుతున్నది. అప్పట్లో తెలుగుదేశం నాయకులే టార్గెట్ గా రెచ్చిపోయి జగన్ మెప్పు కోసం ఊడిగం చేసిన పోలీసు అధికారులు ఇప్పుడు భయంతో వణికి పోతున్నారు. తెలుగుదేశం అధినాయకుడు సహా పలువురు పార్టీ నేతల పేర్లు ప్రస్తావించి మరీ సినీమా డైలాగులు వల్లిస్తూ తొడలు చరిచిన పోలీసు అధికారులు ఇప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా బెదిరిపోతున్నారు. దాసుడి తప్పులు దండంతో సరిపెట్టేయండంటూ తెలుగుదేశం నేతలతో కాళ్లబేరానికి వస్తున్నారు. తాము గతంలో అలా వ్యవహరించడానికి వైసీపీ నేతల ఒత్తిడి, బెదరింపులే కారణమంటూ నమ్మబలు కుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారుల సంఘం ప్రతినిథులు తెలుగుదేశం సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిథి వర్ల రామయ్యను శుక్రవారం (జులై 19) కలిసి క్షమాపణలు కోరారు. ముఖ్యంగా నాడు విర్రవీగి చంద్రబాబుపైనే వైసీపీ నేతలతో సమానంగా ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అయితే నాడు ఓ అధికారిగా చేయకూడని పనులు చేశానని మీడియా ముందు అంగీకరించారు. అయితే అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయనీ, వైసీపీ పెద్దల ఆదేశాలు, హుకుం కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చిన చందంగా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. గతంలో ఏపీ పోలిసులపై నమ్మకం లేదన్న ఐదేళ్ల పాటు ఇదే రాష్ట్ర పోలీసుల సహకారంతో పాలన సాగించి ఇప్పుడు మళ్లీ పోలీసులని నిందించడం దారుణమంటూ విమర్శలు చేశారు. మొత్తానికి పోలీసు అధికారుల సంఘం ప్రతినిథుల క్షమాపణలు వారి తప్పులను కడిగేస్తాయా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. పరిధి మీరి వ్యవహరించిన పోలీసులు, అధికారులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/police-officers-assosiation-apolagy-25-181115.html





