తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?
Publish Date:Dec 30, 2025
Advertisement
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన. అయితే మాజీ మంత్రి రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/roja-political-comments-in-tirumala-25-211813.html





