పీవోకే ఎన్నికలలో ప్రజ్వరిల్లిన హింస.!
Publish Date:Jul 27, 2026
Advertisement
పీవోకేలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. అక్కడ నిర్వహించిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికలో రక్తం చిందింది. ఎన్నికల అక్రమాలు, తుపాకీ మోతలతో పీవోకే పోలింగ్ రణరంగాన్ని తలపించింది. పీవోకేలోని భీంబర్, మిర్‌పూర్, కోట్లి జిల్లాల్లోని మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం (జులై 27) జరిగిన తొలి దశ పోలింగ్ లో ఓటింగ్ మొదలైన తొలి గంట నుంచే ఘర్షణలు చోటు చెలరేగాయి.. పక్కా ప్రణాళికతో జరిగిన రిగ్గింగ్, దొంగ ఓట్ల ఆరోపణలు, రాజకీయ వర్గాల మధ్య భౌతిక దాడులతో పోలింగ్ కేంద్రాలు రక్తసిక్తమయ్యాయి. ఈ పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు పీపీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తలే ఇక్కడ పరస్పర దాడులకు తెగబడ్డారు. పీఎంఎల్-ఎన్ అభ్యర్థి, అతని మద్దతుదారులే తమ పార్టీ కార్యకర్త ముఖ్తార్ యూనస్‌ను లక్ష్యంగా చేసుకుని దారుణంగా కాల్చి చంపారని పీపీపీ నేతలు ఆరోపించారు. ఈ దారుణ ఘటనపై పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల పేరిట జరుగుతున్న హింసాకాండపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు అక్కడ భద్రతా అధికారులు ఎక్కడ ఉన్నారు? ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రాజ్యాంగబద్ధంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో స్థానిక అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం బూటకమనీ, ఫలితాలనుఇప్పటికే పాకిస్థాన్ సైన్యం ఖరారు చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో పీవోకే ప్రాంతంలో పాకిస్థాన్ పాలనకు వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు, తిరుగుబాట్లు తలెత్తకుండా ముందే అణచివేసేందుకు పాక్ ఆర్మీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోందని అంటున్నారు. అక్కడి స్థానిక రాజకీయ వ్యవస్థపై, ప్రజాప్రతినిధులపై పూర్తి నియంత్రణ సాధించడమే లక్ష్యంగా సైన్యం కనుసన్నల్లోనే ఈ ఎన్నికల డ్రామాను నడిపిస్తోందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద 13 నియోజకవర్గాల్లో ముగిసిన తొలిదశ పోలింగ్ పీవోకేలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతటి పతనస్థితిలో ఉందో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. PoK Elections Violence, Mukhtar Yunus Murder, Kotli District Clashes, Bilawal Bhutto Zardari, PML-N vs PPP Violence, Pakistan Army PoK Elections
http://www.teluguone.com/news/content/pok-elections-violence-36-227295.html





