'ప్రజలు కోరుకున్నట్టుగానే లోక్పాల్ బిల్లు ':పీఎం
Publish Date:Dec 27, 2011
Advertisement
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా కోరుకున్నట్టుగానే లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేస్తామని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. మంగళవారం లోక్పాల్ బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి పారదర్శకత, ప్రజా సంక్షేమమే అత్యంత ముఖ్యమన్నారు. తాము ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లు సమాజంలో అవినీతిని అంతం చేస్తుందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. బిల్లు బలహీనంగా ఉందని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగానే బిల్లు ఉందని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉందని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి సహకరించడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు. జాతీయ ప్రయోజనాలకు ప్రథమ స్థానం ఇచ్చే ఆలోచన చేయాలని ఆయన సూచించారు. అశించిన స్థాయిలోనే బిల్లు ఉందని ఆయన చెప్పారు.అవినీతిని అంతమొందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని ఆయన అన్నారు. నిత్యావసర సేవల్లో అవినీతి లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం దేశం యావత్తూ చూస్తోందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడుతోందని ఆయన చెప్పారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని, లోక్‌పాల్ పరిధిలోకి సిబిఐని తేవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. సిటిజన్స్ చార్టర్, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన జవాబుదారీ తనం వల్ల అవినీతిని నియంత్రించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుండగా, లోక్పాల్ బిల్లును కొన్ని సవరణలతో ఆమోదించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమే చర్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. అయితే, లోక్పాల్ పరిధిలోకి సీబీఐను చేర్చడానికి కేంద్రం ససేమిరా అంటోంది.
కాగా, ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని శిక్షించాల్సిందేనని సామాజివేత్త అన్నా హజారే పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాయని ఆరోపించారు.నిరంతరం పోరాటం చేస్తేనే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినందువల్లే కల్మాడీ జైలుకెళ్లారని చెప్పారు. చివరి శ్వాస వరకూ అవినీతిపై పోరాడుతానని హజారే స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడే ఎలాంటి ప్రజా ప్రతినిధినైనా రీకాల్ చేసేలా బిల్లులో సవరణ చేయాలని హజారే డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/peoples-24-10308.html





