బొత్స, కిరణ్ కు క్లాస్ పీకిన ఆజాద్
Publish Date:Mar 22, 2012
Advertisement
ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఇబ్బందికరంగా మారాయి. ఉప ఎన్నికలు జరిగిన ఏడు నియోజకవర్గాల్లో గెలవడం మాట అటుంచి కనీసం ఒక్క నియోజకవర్గం కూడా గట్టిపోటీని ఇవ్వలేకపోవడానికి కారణం ఏమిటని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కిరణ్, బొత్సలను ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యంగా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి పి. శ్రీనివాస్ రెడ్డి మూడవస్థానంలో నిలబడటం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా సెంటిమెంట్ ను సాకుగా చూపిస్తున్నారు సరే మరి కోవూరులో ఎందుకు గెలవలేకపోయారు అని ఆయన వీరిద్దరినీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన ప్రసన్నకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటర్లను చీల్చుకోలేరని, ఆయనకు పడే ఓట్లలో ఎక్కువగా టిడిపినుంచే వస్తాయని వీరిద్దరూ మొదట అధిష్టానానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా కోవూరులో టిడిపి అభ్యర్ధి చంద్రమోహన్ రెడ్డి రెండవ స్థానంలోనిలబడగా కాంగ్రెస్ అభ్యర్ధి మూడవ స్థానంలో సరిపెట్టుకోవలసి వచ్చింది. కోవూరులో పరిస్థితి ఇలా వుంటే త్వరలో 18 నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటని ఆయన వీరిద్దరినీ నిలదీసినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/pcc-chief-botsa-24-12851.html





