పిఠాపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పవన్
Publish Date:Apr 2, 2024
Advertisement
రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం అవుతారు. కాగా, పిఠాపురంలో పవన్ నాలుగో రోజు పర్యటనలో బీజీగా గడుపుతున్నారు.
పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చా. నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు తీసుకుని ఉంటా. నన్ను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచింది. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్ లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రముఖులు, వైసీపీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పవన్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గంలోని అందరినీ వ్యక్తిగతంగా కలవాలన్న ఆశ తనకు ఉన్నప్పటికీ భద్రతాపరమైన కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్ తెలిపారు. ప్రత్యర్థుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. భద్రతాపరమైన ప్రొటోకాల్ పాటిస్తూ రోజుకి 200 మందిని కలిసి వారితో ఫొటోలు తీసుకుంటానని తెలిపారు. శ్రీపాదశ్రీవల్లభుడు, పురుహూతికా అమ్మవారు, బషీర్ బీబీ (బంగారు పాప) దర్గా, ఆంధ్రా బాప్టిస్టు చర్చి సాక్షిగా ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను భగవంతుడినీ ఏదీ కావాలని కోరుకోనని, అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో నల్గొండకు చెం దిన అభిమాని వచ్చి ఒక్క హిట్ ఇవ్వు అన్నా అని అడిగాడు. అప్పుడు ఒక్క హిట్ ఇవ్వమని, భీమవరంలో ఓడిపోయిన తర్వాత గెలుపు ఇవ్వమని భగవంతుడిని కోరానని, ఆ మేరకు తనను పిఠాపురం పిలిచిందని చెప్పారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఉండాలన్నదీ త్వరలో నిర్ణయించుకుంటాని, పురుహూతికా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుని ఉంటానన్నారు. పగిలే గాజు గ్లాసుకు పదును ఎక్కువన్నారు. అందరినీ ప్రత్యేకించి కలుస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలనూ తెలుసుకుంటానని తెలిపారు.పవన్ నేడు పిఠాపురం పర్యటనను ముగించుకుని రేపు తెనాలి వెళ్తారు. 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 9న ఉగాది సందర్భంగా పిఠాపురంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.
http://www.teluguone.com/news/content/pawan-offered-special-prayers-in-the-church-25-173118.html