పవన్ మరో బాంబు.. బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీలోనూ వైసీపీ చేతివాటం!
Publish Date:Jul 23, 2023
Advertisement
మహేష్ బాబు అతడు సినిమాలో నటుడు తనికెళ్ళ భరణి హీరో పార్ధు గురించి ఒక డైలాగ్ చెప్తారు. ఎవడన్నా కోపంగా కొడతాడు.. లేక బలంగా కొడతాడు.. వీడేంట్రా శ్రద్ధగా కొట్టాడు. ఏదో గులాబీ మొక్కకి అంటుకట్టినట్లు, ఏదో గోడ కట్టినట్లు చాలా జాగ్రత్తగా.. పద్ధతిగా కొట్టాడు అంటారు. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ వరస కూడా అలాగే ఉంది. చాలా జాగ్రత్తగా లెక్కలేసి.. ఒక పద్ధతి ప్రకారం ఒక్కో అంశాన్ని టేకప్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ చేసిన ఏపీలో వాలంటీర్ల డేటా కలెక్షన్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తుంది. కానీ, పవన్ చేసిన ఆరోపణలను తప్పని మాత్రం నిరూపించలేకపోతుంది. వాలంటీర్లు సమీకరించే డేటా భద్రంగానే ఉందని చెప్పలేకపోతున్న జగన్.. పవన్ పై ఎక్కడ వీలయితే అక్కడ వ్యక్తిగత దాడి చేస్తున్నారు. జగన్ విమర్శలు ఏమైనా కానీ.. ఈ వాలంటీర్ల డేటా భద్రమే అనే నమ్మకాన్ని మాత్రం ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఆ అంశం అలా నడుస్తుండగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో బర్నింగ్ అంశాన్ని లేవనెత్తారు. అదే జగన్ సర్కార్ బడి పిల్లలకు అందించిన బైజూస్ ట్యాబుల పంపిణీ. ఈ ట్యాబుల పంపిణీలో భారీ అవకతవకలు ఉన్నాయన్నది పవన్ లేటెస్టుగా లేవనెత్తిన ఆరోపణ. బైజూస్ సంస్థ భారీగా నష్టాల్లో ఉందన్న విషయం తెలిసి కూడా భారీ మొత్తం చెల్లించి ట్యాబుల పంపిణీ ఆ సంస్థకు కట్టబెట్టడం వెనకున్న మతలబు ఏంటో చెప్పాలని వైసీపీ ప్రభుత్వానికి పవన్ సవాల్ విసిరారు. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న ఆధారాలను, గతంలో మీడియాలో వచ్చిన కథనాలను కూడా ట్యాగ్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని తేల్చాలని కోరుతూ పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా తన ట్వీట్ ని పవన్ ట్యాగ్ చేశారు. ఇప్పటి వరకూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ రిక్రూట్‌మెంట్లు, టీచర్ ట్రైనింగ్ లేదని.. కానీ, నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. ఈ ట్యాబుల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిలేదని ఆరోపించారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే బైజూస్ 2021లోనే 17 రెట్లు నష్టాలను చవిచూసింది. మీడియాలో వచ్చిన ఇదే కథనాన్ని పవన్ తన ట్వీట్ కు జతపరిచి.. నష్టాల్లో ఉన్న కంపెనీకి ఏ ఆదాయం లేకుండా ఎలా అప్పగించారని పవన్ మండిపడ్డారు. అసలు ఈ ట్యాబుల పంపిణీకి ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేసుకున్నాయి? దరఖాస్తు చేసుకున్న కంపెనీలను ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీలలో ట్యాబుల పంపిణీ బైజూస్ కు ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? అసలు ఈ ప్రక్రియ ఏ పద్ధతి ప్రకారం చేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని.. ఈ సమగ్ర వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయా? అన్న విషయాలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై ప్రభుత్వ వర్గాలు ఏమైనా స్పందిస్తాయా? లేక ఎప్పటి లాగానే పవన్ మూడు పెళ్లిళ్ల అంశాన్నే దీనికి కూడా సమాధానంగా దాడికి ఉపయోగిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/pawan-alleges-jagan-sarka-25-158860.html





