వెలగపూడిని దెబ్బకొట్టేందుకు వైసీపీ కుయుక్తి.. ఓట్ల గల్లంతు
Publish Date:Jul 23, 2023
Advertisement
ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలి.. సామ దాన దండోపాయాలను ఉపయోగించి అయినా మళ్ళీ అధికారం పీఠంపై కూర్చోవాలి. ఇదీ ఇప్పుడు ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఇందుకోసం కంకణం కట్టుకున్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కకు పెట్టేసి బడుగు బలహీన వర్గాలకు పప్పు బెల్లాలు పంచుతూ అవే ఓట్టుగా మారుతాయని భావిస్తున్న జగన్ సామజిక వర్గాల వారీగా, మత ప్రాతిపదికన కూడా గాలమేసి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీని దెబ్బతీసే మరికొన్ని ప్రయోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన అంశం.. రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్ల గల్లంతు.. ఓట్ల బదిలీ. ఈ అంశంపై ప్రతిపక్షాలు భారీగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కీలకమైన, టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకూ టీడీపీనే గెలుస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్థానంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లూ టీడీపీయే గెలిచింది. ఈ మూడు సార్లూ కూడా ఆ నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబే గెలిచారు. టీడీపీ కఠిన పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎదురు నిలబడే రామకృష్ణ బాబుకు ఆయన నియోజకవర్గంలో కూడా అదే పేరుంది. అందుకే ఆయన ఓటమి అనేది ఎరుగరు. నిజానికి ఆయనది విశాఖ జిల్లా కూడా కాదు. ఎక్కడో విజయవాడ నుంచి విశాఖకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఆయన నందమూరి బాలకృష్ణకు ఆప్తుడిగా పేరుంది. బాలయ్య సిఫార్సు మేరకే 2009లో తొలిసారి సీటు దక్కించుకున్నారు. బాలకృష్ణ సిఫార్సు అయితే చేశారు కానీ ఎన్నికలలో గెలిచింది మాత్రం ఆయనే. 2009లో ప్రజారాజ్యం పార్టీ భారీగా ఇక్కడ ఓట్లు చీల్చినా వెలగపూడి తట్టుకొని నిలబడ్డారు. ఆ తర్వాత 2014లో ఆయనకు ఏపీలో రెండవ అతి పెద్ద మెజారిటీ దాదాపుగా 47 వేల పై చిలుకు వచ్చిందంటే ఆయన ఛరిస్మా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక, 2019లో జగన్ ఒక్క ఛాన్స్ వేవ్ లో కూడా తట్టుకొని నిలబడిన వెలగపూడి.. అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ దాడి చేసే సమయంలో.. వెలగపూడి చంద్రబాబు ముందు నిలబడి సవాల్ విసిరి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు. అందుకే వైసీపీ కన్ను ఈ స్థానంపై పడింది. చట్టబద్దంగా అయితే ఈ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేరు కనుక ఇక్కడ భారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్ల గల్లంతుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 వేలకు పై చిలుకు ఓట్లను తొలగించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన నియోజకవర్గంలో మొత్తం 40 వేల ఓట్లు గల్లంతు అయ్యాయని వెలగపూడి తీవ్రమైన ఆరోపణ చేశారు. 2019లో ఉన్న ఓట్లు ఇప్పుడు ఎలా మాయమవుతాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిని అధికారులు కూడా దృవీకరిస్తున్నారట. ఓట్లను తొలగించిన మాట వాస్తవేమని.. అయితే, తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నామని చెబుతున్నారట. దీంతో పాటు ఒకే కుటుంబంలో ఉన్న వారిని వేరు వేరు బూతులలోకి బదిలీ చేస్తున్నారట. ఇప్పటికే ఇలా ఓట్లు కోల్పోయిన వారు, బదిలీ అయిన వారు అధికారులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/ycp-tampering-voters-list-25-158858.html





