సొమ్ము సర్పంచ్ లది.. సోకు ప్రభుత్వానిది.. బిల్లులు రాక కూలీలుగా మారుతున్న సర్పంచ్ లు
Publish Date:Jun 1, 2022
Advertisement
పల్లె ప్రగతితో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన గురించి మాత్రం ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజా ప్రతనిధులు అప్పులపాలై అల్లాడుతుంటే కనీసం వారి గురించి ఆలోచించడం లేదు. మూడేళ్లుగా చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో సర్పంచ్ లు అప్పులపాలై వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పల్లె ప్రగతి అని గొప్పగా భుజ కీర్తులు తగిలించుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్ మాత్రం పల్లెప్రగతి పనుల టార్గెట్ల పేరిట సర్పంచ్ లను తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ టార్గెట్లు రీచ్ కావడానికి సర్పంచ్ లు అప్పులు చేసి మరీ గ్రామాలలో అభివృద్ధి పనులు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో మాత్రం ప్రభుత్వం అలవికాని ఉదాశీనత ప్రదర్శిస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిథులను పావులుగా వాడుకుని గ్రామాల అభివృద్ధి తన ఘనతేనని ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటోంది. అప్పులు చేసి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ లు మాత్రం చేసిన పనుల కు సంబంధించిన బిల్లులు రాక, అప్పలు తడిసి మోపెడై కుటుంబాలు గడిచేదెలా అని మధన పడుతున్నారు. అలా ప్రభుత్వ టార్గెట్లను చేరుకోవడం కోసం అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన ఓ సర్పంచ్ బిల్లులు రాక, అప్పులు తీర్చ లేక, కుటుంబం గడిచేదారి కానరాక కూలీగా మారాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం గ్రామ సర్పంచ్ దయనీయ గాధ ఇది. అభివృద్ధిలో తన గ్రామం అగ్రస్థానంలో ఉండాలని తుక్కాపురం గ్రామ సర్పంచ్ దయ్యాల రాజు గత మూడేళ్లుగా అప్పులు చేసి మరీ గ్రామాభివృద్ధి పనులు చేశారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అధికారులకు సమర్పించాడు. అయితే ఆ బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు నానా యాతనా పెడుతున్నారని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు, మాపు అంటూ తిప్పడమే తప్ప గత మూడేళ్లుగా ఒక్క పైసా కూడా చెల్లించలేదని దయ్యాల రాజు ఆరోపిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వ్యవసాయ కూలీ పనులకు వెడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాననీ, అప్పులు తీరే మార్గం కనిపించక అల్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిథుల పట్ల ఈ ప్రభుత్వానికి కనీస గౌరవం కూడా లేదని విమర్శిస్తున్నాడు. తాము అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే, చేసిన వాటిని బిల్లులు చెల్లించడం మాని.. అదంతా తమ ఘనతే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారని సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పల్లె ప్రగతి కింద గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల తాలూకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నుంచి పల్లె ప్రగతి పనులు చేయాలంటే పెండింగ్ బిల్లులు ఇచ్చి తీరాల్సిందేనని సర్పంచ్ లు ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో మంగళవారం నిర్వహించిన పల్లె ప్రగతి సన్నాహక సమావేశాలను పలు చోట్ల సర్పంచ్ లు బహిష్కరించారు. దీంతో సమావేశాలన్నీ ఏదో జరిగాయన్నట్లు జరిపించేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో 15 గ్రామాల సర్పంచులు గైర్హాజరయ్యారు. గన్నేరువరం మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఒక్క సర్పంచ్ కూడా రాలేదు. వీణవంక మండలంలోనూ ఇదే పరిస్థితి. గంగాధర మండల పరిషత్ ఆఫీసులో నిర్వహించిన పల్లె ప్రగతి సన్నాహక సదస్సును సర్పంచులు బాయ్ కాట్ చేశారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, ఐదో విడత పల్లె ప్రగతికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలంలోనూ సర్పంచ్ లు ఆందోళనకు దిగారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో కలెక్టర్ కాన్ఫరెన్స్‌ను సర్పంచులు బైకాట్చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 27 మంది సర్పంచులకు 12 మంది మాత్రమే హాజరయ్యారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. దీంతో ఐదో విడత పల్లె ప్రగతి పనుల పరిస్థితి డోలాయమానంలో పడింది.
http://www.teluguone.com/news/content/palle-pragati-bills-pending-sarpanchs-protest-25-136781.html





