మింగ మెతుకు లేదు కానీ..మీసాలకు సంపెంగ నూనా?.. కేసీఆర్ అడ్వర్టైజ్ మెంట్లపై విపక్షాల ఫైర్
Publish Date:Jun 2, 2022
Advertisement
ఏ కుటుంబమైనా ఆదాయానికీ, వ్యయానికీ అంతరం ఎక్కువై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఏం చేస్తుంది. ఖర్చులు తగ్గించుకుని ప్రథామ్యాల ప్రకారం ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది. పొదుపు పాటిస్తుంది. వాయిదా వేయడానికి అవకాశం ఉన్న అన్ని ఖర్చులనీ ఆపేస్తుంది. తప్పని సరి అవసరాలను కూడా సాధ్యమైనంత మేర తగ్గించుకుని జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. మరి అదే పరిస్థతిని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంటే.. ప్రభుత్వాధినేత ఏం చేయాలి.. పొదుపు పాటించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. అత్యవసర అవసరాలకు నిధుల కొరత లేకుండా వాయిదా వేయడానికి అవకాశం ఉన్న వ్యయాలన్నిటినీ ఆపేయాలి. దుబారా జోలికి అసలు వెళ్లకూడదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎక్కడా పైసా అప్పుపుట్టే మార్గం కనిపించడం లేదు. రాష్ట్ర అవసరాలను ఏకరవు పెట్టి బహిరంగ మార్కెట్ లో అప్పు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్రం చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాథ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యవహరించిన తీరు.. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుంది. రాష్ట్రం ఒక పక్క ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఎక్కడా అప్పుపుట్టే దారి కనబడటం లేదు. ఆఖరికి ఒకటో తేదీన ఉద్యోగులు జీతాలివ్వలేక, సమయానికి పెన్షన్లు ఇవ్వలేక ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా నిధుల కొరతతో నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దుబారా తగ్గించుకుని ఉన్న నిధులను పొదుపుగా వాడుతూ, జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకు వాటిని కేటాయించాలి. నిధుల కొరత కారణంగా ప్రగతి పనులు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కేసీర్ సర్కార్ అందుకు భిన్నంగా తమ ప్రభుత్వ ఘనతలను చాటుకుంటూ.. కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసం ఇష్టారీతిన పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కార్ జారీ చేసిన ప్రకటనలపై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా ఒక పేజీ ప్రకటన అదీ రాష్ట్రంలోని దినపత్రికలకు ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు..కానీ ఏకంగా మూడేసి పేజీలు తెలంగాణ పత్రికలకే కాకుండా.. ఇతర రాష్ట్రాల పత్రికలలో ప్రకటనలు గుప్పించడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయ. ఏపీ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వెలువడే పత్రికలకు కూడా మూడేసి ఫుల్ పేజీల అడ్వర్టైజ్ మెంట్లు జారీ చేసి తెలంగాణ సొమ్మను వృధా చేసే అధికారం కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాయి. జాతీయ స్థాయిలో తన ఇమేజ్ పెంచుకోవాలన్న వ్యక్తిగత ప్రచార యావ తప్ప ఈ ప్రకటనల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేముందని నిలదీస్తున్నాయి. ఆ ప్రకటనల సొమ్మును రాష్ట్ర అవసరాలకు వినియోగించి ఉంటే కొంతలో కొంతైనా ఇబ్బందులు తగ్గేవి కదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంగా రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకూ, పెన్షన్లకు నిధులు లేవు కానీ.. జాతీయ స్థాయిలో తన గుర్తింపు కోసం కోట్లాది రూపాయల వ్యయంతో ప్రకటనలు గుప్పించడమేమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడాన్ని తప్పుపడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/opposition-criticises-tfoemation-ads-in-nation-wide-news-papers-25-136912.html





