కేంద్రంపై మళ్ళీ అవే విమర్శలు అయినా , ట్రాక్ తప్పింది ..
Publish Date:Jun 2, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుతం పై కత్తులు దుశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకల్లో భాగంగా, హైదరబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ముఖ్యమత్రి, ఈ ఎనిమిదేళ్ళ కాలంలో రాష్ట్రం సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. పనిలో పనిగా, కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. హెచ్చరికలు చేశారు. అయితే, ఎందుకనో ఏమో కానీ, ముఖ్యమంత్రి ప్రసంగలో, ముఖ్యంగా కేంద్రంపై విమర్శల విషయంలో కొంత పదును తగ్గిందని, ముఖ్యమత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా విన్న పార్టీ నాయకులు కొందరు చెవులు కోరుకుంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని, మొదటి నుంచి చివరి వరకు వింటే, కేంద్రంపై విమర్శల భాగం, ఒక విధంగా అతికించినట్లు ఉందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పు కొచ్చారు. నిజానికి, ముఖ్యమంత్రి ప్రసంగంలో ఈ ఎనిమిదేళ్ళలో రాష్ట్రం సాధించిన ప్రగతిని మాత్రమే ప్రస్తావించాలని, విమర్శల అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని భావించారు. అయితే, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్రం పై విమర్శలను చేర్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే, లవ్ స్టోరీలో సెపరేట్ కామెడీ ట్రాక్ లాగా, ప్రధాన ఉపన్యాసంతో సంబంధం లేకుండా, చివర్లో విమర్శల స్పీచ్’ నడిచిందని అంటున్నారు. అయితే, ముందు విమర్శలు వద్దని ఎందుకు అనుకున్నారు, చివర్లో విమర్శలను ఎందుకు అతికించారు, అంటే అందుకు సంబంధించి విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ దూకుడును తగ్గించేందుకు, గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నాయకులు వ్యూహాత్మకంగా కేంద్రం బుజాన తుపాకి పెట్టి రాష్ట్రంలో బీజేపీని లేపే ప్రయత్నం చేశారు. అయితే, నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, బీజేపీ రాష్ట్రంలో ఏకు మేకై కూర్చొంది. మరో వంక తాజాగా నిర్వహించిన సర్వేలో, ఇప్పటికీ ఎడ్జి, తెరాసకే ఉన్నా, బీజీపీ30 ప్లస్ స్థానలో సెకండ్ ప్లేస్’లో నిలుస్తోంది. దీంతో, కేసీఆర్ కాంగ్రెస్ ను బలహీన పరిచి, తప్పుచేశామనే విషయాన్ని కొంత ఆలస్యంగా తెలుసు కున్నారు. అందుకే, ఇక బీజేపీ మైలేజిని పెంచే విమర్శలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే, రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వద్దని కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే, స్పీచ్ కాపీ తయరైంది. అయితే, నిన్న (బుధవారం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ నోటీసులు జారీ చేయడం, అందుకు ఒక రోజు ముందు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్’ ను ఈడీ అరెస్ట్ చేయడం, మొన్న కశ్మీరులో ఫరూక్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించడం.. కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్టు.. నెక్స్ట్ టార్గెట్ తెరాస నాయకులే అన్నవదంతులు వినవస్తున్న నేపధ్యంలో ఇంతవరకు కేంద్రం పై విమర్శలు చేసి, ఇప్పుడు సైలెంట్ అయిపోతే, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉందని, భావించడం వల్లనే, ఆఖరి క్షణంలో, విమర్శల చాప్టర్ చేర్చారని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి చేసిన విమర్శలలో కొత్తదనం ఏమీ లేదని, గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణలనే మళ్ళీ వినిపించారని పరిశీలకులు అంటున్నారు. నిజమే, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందని ముఖ్యమంత్రి, ఇతర తెరాస మంత్రులు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పడు ముఖ్యమంత్రి అదే ఆరోపణ చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేక సార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడారని చెప్పారు. దేశంలో రైతులు బిక్షగాళ్ళు కాదని... రైతులతో పెట్టుకోవద్దని కేసీఆర్ మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు.నిజానికి ఇవేవీ కూడా ఇప్పుడే కొత్తగా చేసిన ఆరోపణలు కాదు. అయితే భాషలో మాత్రం కొంత మార్పు కనిపించిందని అంటున్నారు. అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే పతాక స్థాయికి చేరిన యుద్ధం ఇక ముందు కూడా ఇలాగే సాగుతుందా.. కొంచెం ఆలస్యంగానే అయినా తత్త్వం బోధపడుతుందా, అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-same-criticism-on-ceter-but-side-track-25-136905.html





