తెలుగు రాష్ట్రాల్లో వానలు అప్పుడే కాదు..!
Publish Date:Jun 3, 2022
Advertisement
మండే ఎండలు తెలుగు రాష్ట్రాలను అప్పుడే వదిలేటట్టు లేవు. కేరళలోకి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రవేశించినా అవి తెలుడగు రాష్ట్రాలలోకి విస్తరించడానికి మాత్రం జాప్యం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ హీట్ ప్రభావమో ఏమో కానీ రుతుపవనాల రాకకోసం తెలుగు రాష్ట్రాలు మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పేట్టు లేదు. తెలుగు రాష్ట్రాలలో వర్షాలకు మరో వారం రోజులకు పైగానే రోజులు వేచి చూడాల్సిందేనని భారత వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటి వరకూ ఎండల తీవ్రత ఉంటుందని పేర్కొంది. రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా మేరకు తెలుగురాష్ట్రాలలో జూన్ రెండో వారం వరకూ వర్షాలు కురిసే అవకాశం లేదు. అప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రతాపానికి అల్లాడాల్సిందే. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉంటాయి. ఎండకు తోడు ఉక్కపోత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతుండగా అధికారులు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ 8 నాటికి తెలుగు రాష్ట్రాలను పలకరించే అవకాశం ఉందని పేర్కొంది.
http://www.teluguone.com/news/content/no-monsson-rains-in-telugu-states-up-to-8th-june-25-136961.html





