తెరాస నేతల్లో అంతర్మథనం?
Publish Date:Jun 3, 2022
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో కాదేది స్పెక్యులేషన్’ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదిగో తోక అంటే అదిగో పాము అన్నట్లుగా రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటో ఆరో నిజం అయినా, చాలా వరకు గాలి కబుర్లుగానే మిగిలి పోతున్నాయి. సరే, అదలా ఉంటే తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు, తన పుట్టినరోజు జూన్ 4) సందర్భంగా ఒక రోజు ముందు గురువారం తిరుపతి వెళ్లారు. అక్కడినుంచి అలిపిరి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు హరీశ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందులో రాజకీయ వాసనలు ఏమీ లేవు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలోనూ ఆయన రాజకీయాలు మాట్లాడలేదు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలకు హరీశ్ రావు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్నవారిని నిరాశ పరుస్తున్నందుకు మన్నించాలని ట్వీట్ చేశారు. అభిమానుల ఆదరాభిమానాలు, ప్రేమను తన గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు. నిజానికి ఆయన ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం తమ పుట్టిన రోజు శ్రీవారి సన్నిధిలోనే జరుపుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా.. కానీ, హరీష్ రావు తిరుమల యాత్ర విషయంలో సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ కథనాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కీలక రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో, హరీష్ రావు తమ రాజకీయ భవిష్యత్’కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని, ఈనేపధ్యంలోనే హరీష్ రావు స్వామి వారి అశీస్సులు తీసుకునేదుకు తిరుమల వెళ్ళారని అంటున్నారు. అయితే నిజం ఏమంటే గత కొన్నాళ్లుగా ప్రతి ఏడాది తన పుట్టిన రోజుకు హరీశ్ రావు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.అదే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించిన హరీశ్.. ఈసారి స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిజానికి అందులోనూ విశేషం లేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి విజయం సాధించిన అనంతరం కూడా హరీశ్ రావు తిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.ఆ సమయంలో కేసీఆర్ సతీమణి శోభ సైతం తిరుమల వెళ్లారు. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా హరీశ్ రావు తిరుమల వెళ్లారు. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు తెలంగాణ మంత్రులు చాలా మంది ఏదో ఒక సందర్భంలో తిరుమల వెళుతూనే ఉన్నారు, స్వామి వారిని దర్శించుకుంటూనే ఉన్నారు. నిజానికి, కొద్ది నెలల క్రితం ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, కవిత తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఆమె కూడా అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకనే కొండకు చేరుకున్నారు.మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ, ప్రభుత్వ పగ్గాలు కుమారుడు కేటీఆర్’ కు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో హరీష్ రావుతో పాటుగా మరికొందరు సీనియర్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్’ విషయంలో ఆందోళన చెందుతున్నారని పార్టీ వర్గాలలోనూ వినిపిస్తోంది. హరీష్ తిరుమల వెళ్ళింది అందుకు కాకపోయినా, అధికార తెరాస నాయకుల్లో అంతర్మథనంజరుగుతొందనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు. అదలా ఉంటే రాజకీయ పరిశీలకులు మాత్రం నిప్పులేనిదే పొగరాదు కదా అంటూ ముక్తాయింపు ఇస్తున్నారు.
http://www.teluguone.com/news/content/introspection-in-trs-leaders-25-136954.html





