నిజామాబాద్ జిల్లాలో కంకర స్కామ్
Publish Date:Feb 16, 2012
Advertisement
నిజామాబాద్ జిల్లా:నిజామాబాద్ జిల్లాలో కొందరు కాంట్రాక్టర్లు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై కంకర నుంచి కాసులు పిండుకుంటున్నారు. సహజసిద్ధమైన గుట్టలను, చిన్న చిన్న కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా కోట్లాది రూపాయల మేరకు ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. ఇచ్చిన అనుమతులకు మించి సరిహద్దులు దాటి కంకర దోచేస్తున్నారు. ఎలాంటి సీనరేజిలు చెల్లించకుండానే, బిల్లులు లేకుండా అక్రమార్కులు కంకర స్వాహా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భూగర్భ గనులశాఖ 76 స్టోన్, మెటల్ లీజులను మంజూరు చేసింది. ఈ లీజులు పొందిన కాంట్రాక్టర్లు చాలాకాలంగా గనులశాఖకు సీనరేజి చెల్లించకుండానే, పర్మిట్లు తీసుకోకుండానే కంకరను రవాణా చేస్తున్నారు. అంతేకాకుండా కేటాయించిన భూమిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వేలాది టన్నుల కంకరను తవ్వి కైంకర్యం చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లలో ప్రైవేట్ కట్టడాలకోసం కంకరను తరలిస్తున్నారు. ఇటీవల గనులశాఖ అధికారులు వీరిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించి కొన్ని వాహనాలను అటకయించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే జిల్లాకు చెందిన ఒక మంత్రి ఈ అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వారి కార్యకలాపాలకు అడ్డుతగలొద్దని హెచ్చరించారు. కావాలంటే కంటి తుడుపుగా నామమాత్రపు జరిమానా విధించి వాళ్ళని వదిలేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఈ సలహా గనులశాఖ అధికారులకు నచ్చి కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకుని ఫైన్ విధించి తరువాత వాటిని వదిలేసి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో మంత్రి అండదండలు ఉన్న ఈ కాంట్రాక్టర్లు ఏ నిబంధనను పాటించడం లేదు. కంకర మిషన్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతాలకు దుమ్మురాకుండా క్రషర్ల చుట్టూ ఎత్తైన నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఎక్కడా ఇలాంటి నిర్మాణాలు లేవు. చెరువులకు సమీపంలో క్రషర్లు లేకుండా చూడాలి. దుమ్మూ దూళితో కూడిన రాళ్ళ రేణువులు నీళ్ళలో కలిసి ఆ నీటిని తాగే పశువులు మృత్యువాత పడతాయి. రాళ్ళను పగులగొట్టేందుకు అనుమతి లేకుండా పేలుడు పదార్ధాలను పెద్ద ఎత్తున వినిమోగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nijamabad-24-11959.html





