దేశంలో మోడీ శకం మొదలవనుందా
Publish Date:Dec 31, 2013
Advertisement
ఈ కొత్త సం.లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సుదీర్గమయిన గాంధీ నెహ్రూల శకం అంతమయ్యి, మోడీ శకం మొదలవుతుంది. దేశ పునర్నిర్మాణం, భవిష్యత్ గురించి ఆయన చెపుతున్నమాటలు వింటుంటే మన దేశానికి మళ్ళీ మంచి రోజులు మొదలవబోతున్నాయనే ఆశ, నమ్మకం ప్రజలలో కలుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే ఆయనపట్ల ప్రజలలో నమ్మకం పెంచుకోనేలా చేస్తోంది. మాటలకంటే చేతలకే నరేంద్రమోడీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని గుజరాత్ లో జరిగిన అభివృద్ధి తెలియజెపుతోంది. కాంగ్రెస్ పార్టీలాగే ఒకవేళ మోడీ కూడా ప్రజాకర్షక పధకాలను ప్రకటిస్తూ ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేసి ఉండి ఉంటే వ్యాపారంలో అందెవేసిన గుజరాతీలు ఆయనను ఎప్పుడో తిరస్కరించేవారు. కానీ వారు ఆయనకు వరుసగా మూడుసార్లు పట్టం కట్టారు. అంటే మోడీ వారి గీటురాయి పరీక్షలో నెగ్గినట్లు స్పష్టం అవుతోంది. అందువల్ల అధికారంలోకి కొనసాగడానికి లేదా రావడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి అభాసుపాల్లయ్యే కంటే, ఆ కష్టమేదో అభివృద్ధి కోసం పెడితే తగిన ఫలితాలు వస్తాయని నరేంద్ర మోడీ భావించుతున్నందునే, ప్రజాకర్షక పధకాల గురించి కాక, కేవలం అభివృద్దినే నమ్ముకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేటికీ నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా పధకం, బంగారు తల్లి, ఇందిరమ్మకలలు వంటి ప్రజాకర్షక పధకాలను ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటే, నరేంద్ర మోడీ కేవలం అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. ప్రజలు ఏదీ ఆయాచితంగా పొందాలని కోరుకోవడం లేదు. తమ జీవితాలను చక్కదిద్ధుకొనే మార్గం, వెసులుబాటు చూపితే చాలని వారు కోరుకొంటున్నారు. ఆ సంగతిని మోడీ గ్రహించగలిగారు, గనుకనే ప్రజలను తనవైపు ఆకర్షించగలుగుతున్నారు. ఆయన బీజేపీ ప్రచార భాద్యతలు చెప్పటిన తరువాత దేశంలో విద్య, వైద్య, ఉత్పత్తి రంగాలను అభివృద్ధి చేయాలని అన్నారు. అందువల్ల ఒకవేళ మోడీ ప్రధాని అయినట్లయితే, మౌలిక వసతులు, విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలకు పెద్ద పీట వేయవచ్చును. అదే జరిగితే దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి, నిరుద్యోగం తగ్గు ముఖం పట్టవచ్చును. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పెనుమార్పులు రావాలని కోరుకొంటున్నారు. అది మొన్న డిల్లీ ఎన్నికలతో స్పష్టమయింది. కాంగ్రెస్ వల్ల దేశంలో అభివృద్ధి సాధ్యం కాదనే సంగతి కూడా స్పష్టం అయిపోయింది. కనుక అభివృద్ధికి భరోసా ఇస్తున్న నరేంద్ర మోడీవైపు ప్రజలందరూ చూస్తున్నారు. అందువల్ల ఆయన జపిస్తున్నఅభివృద్ధి మంత్రం ఫలిస్తే, అది ఆయనను అందలం ఎక్కించవచ్చును. ఆ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని మోడీ దేశాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్ళగలిగితే ఆయన పేరు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. లేకుంటే చరిత్రలో ఆయన కూడా మరొక అనామక, అసమర్ధ ప్రధానిగా మిగిలిపోతారు అంతే.
http://www.teluguone.com/news/content/narendra-modi-bjp-37-28912.html