జగన్మోహన్ రెడ్డికి 2014లో అధికారమా? గడ్డు కాలమా?
Publish Date:Dec 30, 2013
Advertisement
వచ్చేఎన్నికలు యూపీయే, ఎన్డీయే కూటములకు ఎంత కీలకమయినవో, అదేవిధంగా రాష్ట్రంలో తెదేపా, వైకాపాల కూడా జీవన్మరణ పోరాటం వంటివని చెప్పవచ్చును. కనుక చంద్రబాబు ఈసారి ఎలాగయినా తెదేపాను గెలిపించుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఇక వైకాపాకి కూడా ఈ ఎన్నికలు నిజంగానే జీవన్మరణ పోరాటం వంటివని చెప్పవచ్చును. ఎన్నికలలో గెలిస్తే పరువాలేదు. కానీ ఓడిపోతే మాత్రం అంతవరకు నిద్రావస్థలో ఉంచబడిన చార్జ్ షీట్లు, కేసులు అన్నీఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి జైలుకి తీసుకుపోవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కాకపోయినా కనీసం కేసులనుండి బయటపడేందుకయినా వైకాపా తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది. తమకూ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అక్రమ సంబంధమూ లేదని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డి, నిజానికి కేంద్రంలో కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాలేనట్లయితే చాలా చిక్కుల్లోపడతారు. అందువల్ల ఇక్కడ రాష్ట్రంలో తన గెలుపు ఎంత ముఖ్యమో, కేంద్రంలో యూపీయే గెలుపు కూడా ఆయనకు అంతే ముఖ్యం. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికార పగ్గాలు చేపడితే జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం మొదలయినట్లే. జగన్ తన పార్టీని గెలిపించుకొని కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకి మద్దతు ఇవ్వడం అత్యంత అవసరం. అప్పుడే అతను కేసుల నుండి బయటపడగలరు. ఈ సంగతి జగన్ కంటే కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు గనుకనే జగన్ పట్ల అంత నమ్మకం పెట్టుకొని స్వంత పార్టీ నేతలకు కూడా హ్యాండిస్తోంది. ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ నిజంగా ఎన్నికల సమాయానికి రాష్ట్ర విభజన గనుక జరుగకపోయినట్లయితే తెలంగాణా వదులుకొని బయటకి వచ్చినందుకు వైకాపాకు తీరని నష్టం కలగడం తధ్యం. అదీగాక సమైక్య రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో సమైక్యాంధ్ర సెంటిమెంటు వాడుకొని లబ్దిపొండడం కష్టం. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తీవ్రమయిన పోటీ ఉంటుంది గనుక, ఎవరికీ మెజార్టీ రానట్లయితే అది వైకాపాకు ఓటమితో సమానమే అవుతుంది. ఇక రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డికి గడ్డు రోజులు ముంచుకు వచ్చినట్లే. చంద్రబాబు, నరేంద్రమోడీ ఇద్దరూ ఇంచుమించు ఒకేరకమయిన ఆలోచనా ధోరణి కలవారు. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తనపై సీబీఐని ఉసిగొల్పి కక్ష సాధినందుకు, మోడీ ప్రధాని పదవి చెప్పటిన తరువాత, అదే సీబీఐని కాంగ్రెస్ పై ప్రయోగించడం ఖాయం.తెదేపా, బీజేపీలు ఇప్పటికే సూత్రప్రాయంగా ఎన్నికల పొత్తులకు అంగీకరించ్నట్లు కనబడుతున్నాయి. అందువల్ల ఎన్నికల ముందు తరువాత కూడా వైకాపాను బీజేపీ దూరంగా ఉంచడం సహజమే. ఇక బ్రదర్ అనిల్ పై రాష్ట్ర బీజేపీ నేతలు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. అందువల్ల వారు కూడా వైకాపాను దూరంగా ఉంచే ప్రయత్నం చేయడమే కాక, ఎన్నికల అనంతరం అనిల్, జగన్మోహన్ రెడ్డిలపై చర్యలకు పూర్తి మద్దతు ఈయవచ్చును. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నఅన్ని కేసులను వేగవంతం చేయవచ్చును. చంద్రబాబు మోడీతో తనకున్నసాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డిపై ఈడీ గతంలో నమోదు చేసిన కేసులను కూడా బయటకు తీయించి విచారణ చేప్పట్టేలా చేయవచ్చును. అందువల్ల వచ్చేఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యవంటివేనని చెప్పవచ్చును. రాష్ట్రంలో తన గెలుపు ఎంత ముఖ్యమో, కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు కూడా ఆయనకు అంతే ముఖ్యం. అంటే రాష్ట్ర విభజనకు పూనుకొన్నకాంగ్రెస్ పార్టీతోనే ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి చేతులు కలపబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఇదంతా కలిపి చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంత హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం, రాష్ట్ర విభజనను జగన్ వ్యతిరేఖిస్తూ సీమాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం అన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ లబ్ధికోసం ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నదేనని అర్ధం అవుతోంది. ఏమయినప్పటికీ, వచ్చే ఎన్నికలలో వైకాపా పూర్తి మెజార్టీతో గెలిస్తే పరిమిత కష్టాలు, ఓడిపోయినట్లయితే మళ్ళీ గడ్డు కాలం తప్పకపోవచ్చును.
http://www.teluguone.com/news/content/-ysr-congress-party-37-28888.html