2019లోనూ 'నమో'స్తుతే అనబోతోందట దేశం....
Publish Date:Sep 4, 2016
Advertisement
మోదీ అంటే కొందరికి ఇష్టం వుండొచ్చు! కొందరికి ఇష్టం లేకపోవచ్చు! కాని, మోదీని పట్టించుకోని వారు మాత్రం ఎవరూ వుండరు! అదే ఆయన సక్సెస్ సీక్రెట్!. దేశంలో పీఎం మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. అంతే స్థాయిలో వివాదాస్పదుడు కూడా! ఇప్పుడే కాదు గుజరాత్ సీఎంగా వున్నప్పటి నుంచే ఆయన కాంట్రవర్సియల్ ఫిగర్. గుజరాత్ అల్లర్లు అంటూ ఆయన్ని పన్నెండేళ్లు వెంటాడారు అభ్యుదయవాదులు. మీడియా, మేధావులు కలిసి మోదీని ప్రతీ రోజూ టార్గెట్ చేసేవారు. అయినా ఆయన తన పని తాను చేసుకుపోయేవారు. గుజరాత్ ను అభివృద్ధిలో మిగతా దేశం మొత్తానికంటే ముందుంచారు. చివరకు, తన చేసిన విమర్శల్నే ఆయుధాలుగా చేసుకుని ఫుల్ ఫేమస్ అయిపోయారు! పీఎం కూడా అయ్యారు!
తనకు ఎదురైనా సవాళ్లనే సువర్ణావకాశాలుగా చేసుకుని దూసుకొచ్చిన మోదీ ఇప్పుడు ప్రధానిగా కూడా అదరగొడుతున్నారు. ఢిల్లీ చేరుకుని రెండున్నర ఏళ్లవుతున్నా ఆయన ఫాలోయింగ్ చెక్కుచెదరలేదు. తాజాగా ఓ ఆన్ లైన్ సర్వేలో ఎంత మంది నమోస్తుతే అన్నారో తెలుసా? డెబ్బై శాతం!
సాధారణంగా ఏ నేత అయినా సంతృప్తికరంగా పని చేస్తే 50శాతానికి మించి మార్కులు పడుతుంటాయి. 60శాతం కూడా దాటితే అతను చాలా బాగా పని చేస్తున్నట్టు లెక్క. కాని, నెక్స్ట్ పీఎం ఎవరైతే బావుంటుంది అంటూ చేసిన ఈ సరికొత్త సర్వేలో ఏకంగా 70శాతం జనం మోదీనే కావాలన్నారట! ఆయన వచ్చాక ధరలు తగ్గలేదు, ఉద్యోగాలు రాలేదు లాంటి ఆరోపణాలు చేస్తోన్న ప్రతిపక్షానికి ఇది దుర్వార్తే!
మోదీ వచ్చాక నిజంగా కూడా భారీ మార్పులు రాలేదు. కాని, జనం ఆయన నిజాయితీకి, కృషికి గుర్తింపు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. దేశదేశాలు తిరుగుతూ భారత్ స్థాయి అంతర్జాతీయంగా పెంచుతూ వస్తోన్న మోదీ రచ్చ గెలవటమే కాదు ఇంట్లో కూడా గెలుస్తున్నాడు. కాని, ఆయన నిర్ణయాల ఫలితాలు కాస్త మెల్లగా జనానికి అందుతున్నాయి. స్వచ్ఛ్ భారత్ నుంచి మేకిన్ ఇండియా వరకు మోదీ చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు 2019 ఎన్నికల నాటికి సానుకూల ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే... ఈ తాజా సర్వే ప్రకారం డెబ్బై శాతం మంది పీఎంగా కోరుకుంటోన్న మోదీయే మరోసారి ప్రధాని కావటం గ్యారెంటీ! ఇది నమో భక్తులకి, బీజేపి అభిమానులకి నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూసే!
http://www.teluguone.com/news/content/narendra-modi-45-66055.html





