అఖిలేష్ యాదవ్ బాటలో నారా లోకేష్
Publish Date:May 18, 2012
Advertisement
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాటలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పయనించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ఇబ్బందుల్లో ఉన్నపుడు అతని తనయుడు అఖిలేష్ యాదవ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మొదట పార్లమెంట్ కు ఎన్నికయి తర్వాత యు.పి.కి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తన తండ్రి చంద్రబాబు నాయుడికి ఇకపై చేదోడు వాదోడుగా ఉండాలని నారా లోకేష్ నిర్ణయించారు. తండ్రి అనుమతితో పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షించడం ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆయన నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటి వద్దకే తన సలహాదారులను రప్పించుకుని మంత్రాంగం నిర్వహిస్తున్నారు. టిడిపి పార్టీ కార్యాలయ ఇన్ ఛార్జి తొండెపు దశరథ జనార్థన్, శాసనమండలి సభ్యుడు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, జయరామ్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన రావు తదితరులను లోకేష్ కు సలహాదారులు గా చంద్రబాబు నియమించారు. వీరు వారంలో రెండు రోజులు లోకేష్ తో కలిసి మంతనాలు సాగిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నగదు బదిలీ పధకాన్ని తన మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పథకానికి అప్పట్లో విశేష ప్రచారం కూడా కల్పించారు. ఈ పథకాన్ని లోకేష్ రూపొందించారని చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఒకవేళ గెలిచి ఉంటే ఈ పథకం వల్లే తాము గెలవగలిగామనే ప్రచారాన్ని తెలుగుదేశం నేతలు చేసి నారా లోకేష్ ను ఆకాశానికెత్తేసేవారే. ఈ ఎన్నికల తర్వాత లోకేష్ స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ వ్యవహారాలకే చాలాకాలం పరిమితమయ్యారు. అయితే నందమూరి కుటుంబసభ్యుల మద్దతు అనిశ్చితంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు ఇకపై పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్ సహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నందమూరి ఫ్యామిలీలో ఒక్క బాలకృష్ణ మినహా ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు. అయితే బాలకృష్ణ రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్నప్పటికీ చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచార సభల్లో బాలకృష్ణ పాల్గొన్నప్పటికీ పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదనే భావనతో చంద్రబాబు ఉన్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్. సభలకు జనం బాగానే వచ్చారు. అతని ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి. కానీ అతను ఎదిగితే తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోకేష్ కు రాజకీయ పాఠాలు నేర్పిస్తున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/nara-akhilesh-in-foot-steps-of-akhilesh-yadav-24-14121.html





