ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ్ని ఏపీలో ఫాలో అవుతున్న కార్లు ఎవరివి?
Publish Date:Jul 10, 2017
Advertisement
కురుక్షేత్రం అంటూ ఏపీలో కాలుమోపిన మంద కృష్ణ మాదిగ సభ సంగతెలా వున్నా కలకలం మాత్రం రేపారు! ఒక రోజంతా ఏపీ పోలీసుల్ని ఉరుకులు, పరుగులు పెట్టించారు. చంద్రబాబు ఇంకా స్వయంగా స్పందించకపోయినా టీడీపీ నేతల చేత కూడా మాట్లాడించగలిగారు! అయితే, ఉన్నట్టుండీ ఆంధ్రాలో దిగిన మంద కృష్ణ ఏం ఆశిస్తున్నారు? పైకి చెబుతన్నట్టుగా కేవలం ఎస్పీ వర్గీకరణే ఆయన ఆశయమా? లేక మరేదైనానా? మంద కృష్ణ సమైక్యాంధ్ర రాష్ట్రం వున్నప్పుడు చంద్రబాబుతోనూ, చంద్రశేఖర రావుతోనూ… ఇద్దరితోనూ కలిసి పని చేశారు! కాని, ఇప్పుడు ఆయన వారిద్దరికీ రివర్స్ అవుతున్నారు. కారణం వర్గీకరణ విషయంలో సీఎంలిద్దరూ మాటతప్పారన్నదే ఆయన ఆరోపణ! కాకపోతే, తెలుగు ప్రాంతం రెండుగా విడిపోయాక ఏపీలో మాలలు అధికంగా, తెలంగాణలో మాదిగలు అధికంగా వున్నారు. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ వచ్చే భారీ లాభాలంటూ ఏం లేవు. మాలలు, మాదిగల మధ్య అవకాశాల విషయంలో పోటీ ముందున్నంత ఇప్పుడు లేదు. రాష్ట్ర విభజనే అందుక్కారణం. ఆ సంగతెలా వున్నా వర్గీకరణ ఉద్యమం మాత్రం ఎమ్మార్పీఎస్ సీరియస్ గానే ముందుకు తీసుకెళ్లె ఉద్దేశంలో వుంది. దాని వల్ల మాదిగలకి జరిగే లాభంతో పాటూ రాజకీయ రాబడి కూడా వుండటమే కారణమంటున్నారు విశ్లేషకులు! తాజాగా మంద కృష్ణ తనపై హత్యా ప్రయత్నం జరగొచ్చని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో తనని కొన్ని కార్లు ఎప్పుడూ వెంబడిస్తున్నాయని అన్నారు. మొత్తం పది రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ పని చేస్తున్నా ఎక్కడా ఇలా జరగలేదని చెప్పారు. తనని ఎవరు ఫాలో చేస్తున్నారో చంద్రబాబుకు, కేసీఆర్ కు ఇద్దరికీ తెలుసునని ఆయన అనటం కొసమెరుపు! అసలు ఫాలో అవుతున్న వారి సంగతి పక్కన పెడితే మంద కృష్ణ చంద్రబాబుని, కేసీఆర్ ని కలిపి టార్గెట్ చేయటంలోని ఆంతర్యం ఏంటి? మూడేళ్లు పూర్తైన సందర్భంలో ఎన్నికలు వడి వడిగా వచ్చేస్తున్నాయి. ఆయన రాబోయే ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నారని కొందరంటున్నారు! రెండు రాష్ట్రాల్లో ఎస్పీ ఓట్లను టీఆర్ఎస్ గాని, టీడీపీగాని తేలిగ్గా తీసుకోవు. అందుకే, రంగంలోకి దిగిన మంద కృష్ణ అధికార పార్టీలకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. తద్వారా ప్రతిపక్షాలకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా నెక్ట్స్ ఎలక్షన్స్ టైంలో తానూ రేసులో వుండాలని ఆయన వ్యూహం పన్నుతున్నట్టు కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసిన మంద కృష్ణ రాజకీయ ఉద్దేశంతో వ్యవహరించటం తప్పేం కాదు. కాని, మరోసారి వర్గీకరణ రణం మొదలుపెట్టిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఎంత ప్రభావం చూపగలిగే స్థాయికి చేరుతారో వేచి చూడాలి!
http://www.teluguone.com/news/content/mrps-45-76201.html





