రామోజీరావును ఇరికించిన రోజా..?
Publish Date:Jul 10, 2017
Advertisement
తనని ఎలాంటి ప్రశ్న వేసినా దబాయించి సమాధానం చెప్పటం వైసీపీ నేత రోజాకి వచ్చినంతగా మరెవరికీ రాదు. తాజాగా ఆమె తాను చేస్తున్న టీవీ షోల గురించి స్పందించింది. తన షో ఏమీ రియాల్టీ షో కాదనీ… కామెడీ షో అని చెప్పింది! అక్కడితో ఆగకుండా అందులో జడ్జ్ గా తాను పాల్గొనటం అంత తప్పైతే వెళ్లి రామోజీ రావుని అడగమని తనదైన స్టైల్లో ఎదురుదాడి చేసింది. ఆమె ఈటీవీలో వచ్చే జబర్దస్త్ గురించి ఇలాంటి ఘాటుగా స్పందించింది! రోజా లాజిక్ ఒకవైపు నుంచీ కరెక్టే! జబర్దస్త్ నిర్మించేది ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, అలాగే, దాన్ని ప్రసారం చేసేది రామోజీ రావు. వాళ్లద్దరిదీ ప్రధానమైన బాధ్యతే. ఎవరైనా కామెడీ పేరుతో బూతులు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తే ఖచ్చితంగా వారిద్దర్నే అడగాలి! కాని, జడ్జ్ గా పార్టిసిపెంట్స్ స్కిట్ లని హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజా కేవలం ఒక నటి మాత్రమే కాదు కదా? ఆమె ఇప్పుడు అసెంబ్లీలో వున్న ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే! మరి ప్రజాప్రతినిధిగా ఆమెకంటూ ఎలాంటి నైతిక బాధ్యతలుండవా? దీని గురించి వైసీపీ నాయకురాలు రోజా మాట్లాడలేదు! ఇక రోజానే చేసే మరో కార్యక్రమం కూడా మీడియాలో పెద్ద రచ్చగా మారింది. రోజాలాగే సుమలత, పోసానీ వంటి వారు కూడా ఈ ఫ్యామిలీ గొడవల కార్యక్రమాలు ఎడాపెడా చేసేస్తున్నారు. అసలు అలాంటి షోల గురించి జనం, మేధావులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎంత వరకూ నిజమో తెలియని కుటుంబ గొడవల్ని పది మందిలో ఈ సెలబ్రిటీ హోస్టులు తీర్చటం ఏంటి అనేది పెద్ద ప్రశ్న! అంతే కాక ఆ షోల్లో జరిగే రచ్చ కూడా విచిత్రంగా, విపరీతంగా వుంటూ కేవలం టీఆర్పీల కోసమే నడుస్తున్నట్టుగా వుంటోందంటున్నారు మానసిక నిపుణులు! యండమూరి వీరేంద్రనాథ్ అయితే ఆ షోలు నిర్వహించే వారు శవాల మీద చిల్లర ఏరుకునే టైపు అంటూ ఘాటుగా స్పందించారు! ఇంత రచ్చకి కారణమవుతోన్న సదరు షోని కూడా రోజా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అసలామె ఒక ఎమ్మెల్యేగా వుంటూ ఇలాంటిది చేయటం ఏమాత్రం బాగాలేదంటున్నారు కొందరు. మరి రోజా ఏమంటారు? ప్రస్తుతానికైతే నో ఆన్సర్! జబర్దస్త్ గురించి రామోజీరావుని అడగమన్నట్టు ఎవర్నైనా అడగండి పొమ్మని అంటారేమో! ఆ సంగతి ఎలా వున్నా పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం … రోజా మరింత హుందాగా సాగే టీవీ కార్యక్రమాలు, సినిమాలు చేస్తే బెటర్! అంతే తప్ప జనంలో ఎంతో కొంత వ్యతిరేక భావం తెచ్చే వాటిలో భాగమైతే ఆమె ఇమేజ్ డ్యామేజై పొలిటికల్ కెరీర్ రిస్క్ లో పడవచ్చు!
http://www.teluguone.com/news/content/roja-45-76205.html





