ప్లీనరీ సరే… ప్లానింగ్ ఏది?
Publish Date:Jul 10, 2017
Advertisement
వైసీపీ ప్లీనరీ ఘనంగా జరిగింది! జగన్ తన ముప్పై ఏళ్ల సీఎం కలని మరోసారి జనం ముందుంచారు! ఇక రాజన్న రాజ్యం నినాదమైతే సభలో మార్మోగింది. కాని, నిజంగా ఈ హడావిడితో వైసీపీ సాధించింది ఏమిటి? అధికార టీడీపీ దశాబ్దాలుగా మహానాడు నిర్వహిస్తోంది. అదే తరహాలో జగన్ కూడా ఆర్బాటంగా పార్టీ వేడుక నిర్వహించారు. అది తప్పేం కాదు. కాని, ప్లీనరీ తరువాత జనంలోకి వెళ్లిన సంకేతాలే ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి! ఆ మధ్య ప్రత్యేక హోదా గురించి వైజాగ్ వెళ్లిన జగన్ ఎయిర్ పోర్ట్ లో నెక్స్ట్ సీఎం తానే అంటూ హల్ చల్ చేశారు! అప్పట్నుంచీ రెండు, మూడు సార్లు నేనే మంత్రి, నేను రాజు అన్నట్టు డైలాగ్స్ వదలనే వదిలారు. ఇక ప్లీనరీలో ఏకంగా ముప్పై ఏళ్లు నేనేనంటూ లాలూని గుర్తు చేశారు! లాలూ ప్రసాద్ యాదవ్ కూడా … ‘’ సమోసాలో ఆలూ వున్నంత వరకూ బీహార్లో లాలూ వుంటా’’డని ఛమత్కారంగా చెప్పేవాడు! ఇప్పుడు లాలూ పరిస్థితి ఏంటన్నది పక్కన పెడితే… జగన్ ఇంకా మొదటిసారి కూడా సీఎం అవ్వకుండానే దశబ్దాల తరబడి అమరావతి నాదే అన్నట్టు మాట్లాడటం మెచ్యురిటీ అనిపించుకోదంటున్నారు కొందరు క్రిటిక్స్! ప్లీనరీలో జగన్ మాటలు మాత్రమే కాదు. కొందరు టీడీపీ నేతలు విమర్శించినట్టుగా… అనేక ఆర్దిక కేసుల్లో ఏ1 నుంచీ ఏ13దాకా తమ పేర్లు నమోదైన వారంతా వేదిక మీదకి చేరారు! ఇదేదో ఆరోపణ కాదు. నిజంగానే టీడీపీ నేతలు చెప్పింది నిజం. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక్క సారి కూడా కోర్టు బోను ఎక్కని చంద్రబాబు, మరో వైపు జగన్ తో సహా సీబీఐ, ఈడీల దృష్టిలో వున్న పార్టీలోని అనేక మంది నాయకుల వైసీపీ ఒకవైపు! కాబట్టి జనం ఎటు వైపు వుండాలో తేలిగ్గానే నిర్ణయించుకుంటారు! ఇక 2014లో మోదీ, తరువాత బీహార్లో నితీష్ ప్రశాంత్ కి కిషోర్ ని తమ వైపున నిలుపుకున్నారు. అది వారికి కలిసొచ్చి ఘనవిజయాలు సాధించారు. అందుకే, ఇప్పుడు జగన్ కూడా పీకే ను తీసుకొచ్చారు. ఇంత వరకూ బాగానే వున్నా అదే ప్రశాంత్ కిషోర్ యూపీలో కాంగ్రెస్ కు ఏమాత్రం మేలు చేయలేకపోయాడని కూడా యువనేత గుర్తించాలి! ప్రశాంత్ కిషోర్ వున్నా లేకున్నా ముందు అవినీతి విషయంలో జనంలో వున్న అనుమానాల్ని జగన్ దూరం చేయాలి. ఆయనొస్తే గతంలోలాగా అవినీతి అరాచకం సృష్టించదని భరోసా కల్పించాలి. అటువంటిదేం ప్లీనరీలో జరిగినట్టు కనిపించలేదు! పైగా ఏ ఆధారం లేకుండా మూడు లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారనీ, ఆయన అవినీతి చక్రవర్తి అని రోటీన్ పొలిటికల్ స్టేట్మెంట్లే ఇచ్చారు! ఇలాంటి స్ట్రాటజీతో చంద్రబాబు లాంటి చాణుక్యుడ్ని గద్దె దించగలననుకోవటం…. జగన్ మళ్లీ మళ్లీ ఆలోచించుకోవాల్సిన అంశం! ఎందుకంటే, అదృష్టవశాత్తూ రాబోయే ఎన్నికలకి ఇంకా తగినంత టైం వుంద కాబట్టి!
http://www.teluguone.com/news/content/ysrcp-plenary-45-76199.html





