టీటీడీ కల్యాణమండపాల్లో సువార్త సభలు! ముగ్గురు రెడ్లపై రఘురామ మండిపాటు
Publish Date:Aug 31, 2021
Advertisement
టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ చేతకాకపోతే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డిలు టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. కల్యాణ మండపాలు అద్దెకిస్తే, అక్కడ సువార్త సభలు పెడితే సుబ్బారెడ్డి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారని, వాటిని ఎవరికో అద్దె కిస్తే పరిస్ఠితి ఏంటని రఘురామ నిలదీశారు. జెరూసలేం వెళ్లే వారికి సబ్సిడీ ఇస్తూ టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెరూసలేంకి ఇచ్చే సబ్సిడీకి తిరుమలలో దోపిడీ ఏంటని ప్రశ్నించారు. టీటీడీ ఆదాయం కోసం రూమ్‌రెంట్లు కూడా పెంచుతున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. టీటీడీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. డబ్బుల కోసం చేసే పనులు మానేయండి.. చేతకాకపోతే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి జవహర్‌రెడ్డిలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగమ మండలి ఏర్పాటు మీద దృష్టి పెట్టాలని రఘురామ కోరారు. నిష్ణాతులైన వారిని ఆగమ మండలిలో నియమించాలన్నారు. ధర్మ పరిషత్‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీటీడీ అధికారులను ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/mp-raghurama-angry-on-ttd-rental-kalyana-mandapas-39-122279.html





