తిరుమల వెంకన్నకే రూ. 3 కోట్ల వెన్నుపోటు.. హవ్వ
Publish Date:Aug 31, 2021
Advertisement
ఆంధ్రాలో జగనన్న హయాంలో ఇష్టారీతి పాలన నడుస్తోంది అనడానికి తాజా నిదర్శనం. ప్రభుత్వంలో తమవాళ్లు ఉన్నారనో లేక తామే ప్రభుత్వం అనుకుంటున్నారో తెలీదు కానీ.. కొందరు అధికారుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం మాత్రం వడ్డీకాసులవాడినే విస్తుపోయేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి రాత్రనకా పగలనకా గర్భగుడిలో నిలబడి భక్తుల నుండి నిలువు దోపిడీల ద్వారా సంపాదిస్తుంటే... భక్తుల కానుకలనే జీతాలుగా తీసుకుంటూ.. ఆయన కొలువులో పనిచేస్తున్న టీటీడీ అధికారులు మాత్రం వెంకన్నకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై అవినీతి పంకిలంలో కూరుకుపోతున్నారు. టీటీడీకి చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన తిరుమలలోని ఓ హోటల్ నిర్వాహకుడికి పరోక్షంగా సహకరించి... ఎవరి కంటా పడకుండా వారిని రాత్రికి రాత్రే తిరుమల నుండి దాటించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుమలలో పెద్ద షాపులు, చిన్న దుకాణాలు, చిల్లర వర్తకులు... ఇలా పలు వ్యాపార సంస్థల నుంచి అద్దెల చెల్లింపులో టీటీడీ నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఒక్క నెల అద్దె బకాయి ఉన్నా కూడా అధికారులు అంగీకరించరు. స్థానిక ప్రజలని కూడా చూడకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. కరోనా కష్ట సమయంలో కూడా స్థానిక వ్యాపారులకు అద్దెల చెల్లింపులో ఒక్క రూపాయి కూడా మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. అందుకు విరుద్ధంగా టీటీడీ పెద్దలు ఓ హోటల్ నిర్వాహకుడికి ఏకంగా మూడు కోట్ల రూపాయల బకాయిలను వదిలేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ హోటల్ సంస్థ రూ. 3 కోట్ల అద్దె బకాయిలు ఎగవేసినా టీటీడీ యాజమాన్యం నోరు మెదపలేదంటే తెరవెనుక ఏం జరిగి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం వారి వద్ద నుండి బకాయిలు రాబట్టుకునే చర్యలు కూడా తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ఖాళీ చేయించి రాత్రికి రాత్రే చెన్నైకి పంపించారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ హోటల్ యాజమాన్యం ద్వారా నెలకు రూ. 23.90 లక్షల అద్దె టీటీడీకి జమ అవుతోంది. ఆ హోటల్ ను కాదనుకుని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఉచితంగా ఇవ్వడానికే చెన్నై హోటల్ ను ఖాళీ చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ భక్తులెవరూ అడగకపోయినా.. ఇటీవల సంప్రదాయ భోజనం అనే నిర్ణయాన్ని తీసుకుంది. అయితే దేవాలయంలో అన్న వ్యాపారం అంటూ ఆ నిర్ణయం మీద విమర్శలు రావడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. అది వేరే విషయం. అయితే భోజన పథకాన్ని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఇవ్వడానికే చెన్నై హోటల్ మేనేజ్ మెంట్ ను భారీ నష్టానికైనా సరే.. అర్ధరాత్రి ఖాళీ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సంప్రదాయ భోజనం కాస్తా బెడిసికొట్టడంతో తిరుమలలోని పలు పెద్ద హోటల్స్ ని కూడా బెంగళూరు సంస్థకు ఉచితంగా కట్టబెట్టే యోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ రూ. 3 కోట్లు ఎగ్గొట్టిన విధంబెట్టిదనిన... తిరుమలలో హోటల్స్ నడపాలంటే దాదాపు 5 కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంది. తిరుమల పాలకమండలి సభ్యుల బోర్డు సమావేశం నిర్వహించే అన్నమయ్య భవన్ కింది భాగంలోనే ఉన్న అన్నమయ్య హోటల్ ను టీటీడీ టెండర్ విధానం ద్వారా లీజుకు కట్టబెడుతుంది. చెన్నైకి చెందిన ఓ యాజమాన్యం ఈ హోటల్ ను నెలకు రూ. 23 లక్షల అద్దె చెల్లించే విధంగా టెండర్ల ద్వారా దక్కించుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆరు మాసాల అద్దెను డిపాజిట్ గా చెల్లించాలి. ఒకవేళ ఈ అద్దె సొమ్మును సక్రమంగా చెల్లించకపోతే మూడు మాసాల వరకు మాత్రమే గడువు ఇచ్చి డిపాజిట్ సొమ్మును టీటీడీ పూర్తిగా స్వాధీనం చేసుకుని హోటల్ ను వెంటనే ఖాళీ చేయించి నిర్వాహకుల వద్దనుండి హోటల్ ను స్వాధీనం చేసుకునే నిబంధనలు ఉన్నాయి. అయితే హోటల్ యాజమాన్యం అద్దె చెల్లించడంలో విఫలమైంది. హోటల్ యాజమాన్యం దాదాపు ఏడాదిన్నరపాటు అద్దెలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో టీటీడీకి నెలకు ఇరవై మూడు లక్షల చొప్పున ఏడాదిన్నర కాలానికి నాలుగున్నర కోట్ల రూపాయల అద్దె బకాయిలు నిలిచిపోయాయి. అయినా టీటీడీ గానీ, పంచాయతీ గానీ, రెవెన్యూ అధికారులు గానీ హోటల్ యాజమాన్యం నుంచి బకాయిలు వసూళ్లు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బకాయిల వసూళ్లకు వెళ్ళినప్పుడల్లా పంచాయతీ, రెవెన్యూ అధికారులను హోటల్ యాజమాన్యం మామూళ్ల మత్తులోకి దింపి మేనేజ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాలుగున్నర కోట్ల బకాయిల వసూళ్లకు హోటల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాగా హోటల్ యాజమాన్యం కరోనా కారణంగా తాము బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు వివిధ సాకులు కారణాలుగా చూపించి, తమ కు మినహాయింపు ఇవ్వాలని నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానాల్లో నాలుగు దఫాలుగా పిటిషన్లు వేసి ఈ పిటిషన్లు సాకుగా చూపించి టీటీడీకి అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేశారు. న్యాయస్థానం మాత్రం హోటల్ యాజమాన్యం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పూర్తి బకాయిలు టీటీడీకి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్ళిన హోటల్ యాజమాన్యం గతంలో రెండు హోటళ్లకు ఇదేవిధంగా టీటీడీ అద్దెల చెల్లింపులో మినహాయింపు ఇచ్చిందని విజ్ఞప్తి చేసింది. అయితే న్యాయస్థానం కూడా టీటీడీ వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషనర్ వాదనను కొట్టేసింది. అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ టీటీడీ అధికారులు మాత్రం ఈ హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కపెట్టారు. నిబంధనల మేరకు ఏ హోటల్ నిర్వాహకుడైనా మూడు మాసాలపాటు అద్దెలు చెల్లించకపోతే వెంటనే చర్యలు తీసుకుని అద్దెలు రికవరీ చేసి హోటల్ ను స్వాధీనం చేసుకుని మళ్లీ టెండరు నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. అయితే ఈ సంఘటనలో ఏడాదిన్నర కాలంగా బాడుగలు చెల్లించకపోయినా ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కోర్టు తీర్పు, బకాయిల వ్యవహారం ఇలా నడుస్తుండగానే టీటీడీలో ఓ ఉన్నతాధికారి హోటల్ నిర్వాహకులతో అనధికారిక సంప్రదింపులు జరిపారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నాలుగున్నర కోట్ల బకాయిలకు గాను డిపాజిట్ సొమ్ము మినహాయించుకొని మరో మూడు కోట్ల రూపాయల బకాయిలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వారి వద్ద నుండి వసూలు చేయకుండా దయా హృదయం చూపించడంలో ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా చెన్నై హోటల్స్ యాజమాన్యం మాత్రం టీటీడీ వైఖరి కారణంగా తంతే బూరెల గంపలో పడ్డట్టయ్యింది. మూడు కోట్లు మిగిలించుకున్న ఆనందంలో హోటల్ ను ఆగమేఘాలపై ఖాళీ చేసి అర్ధరాత్రే చెన్నైకి చెక్కేశారు. మెజారిటీ ప్రజల ఇష్టదైవమైన ఓ ప్రముఖ ధార్మిక సంస్థలో ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు ఇలా అధర్మ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నప్పడు సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే కన్నెర్ర చేస్తాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/hotels-fruad-3-crore-rupees-in-tirulama-39-122281.html





