మోదీ పోరాటం... బీజేపి ఎమ్మెల్యే వెటకారం!
Publish Date:Nov 26, 2016
Advertisement
పార్టీలు, కండువాలు, గుర్తులు, నినాదాలు వేరైనా... మన రాజకీయ నేతలందరూ ఒకే టైపు! మోదీ నల్లదనంపై యుద్ధం ఒకవైపు చేస్తోంటే ఆయన స్వంత పార్టీ ఎమ్మేల్యేనే ఇంకో వైపు నుంచి ఆపహాస్యం చే్స్తున్నాడు. బ్లాక్ మనీకి అసలు మూలం పొలిటీషన్సే అన్నది చక్కగా నిరూపించాడు!
నోట్లు రద్దు చేసి నమో పెద్ద దుమారమే రేపారు. ఆయన పనికి మద్దతు, విమర్శలు రెండూ వస్తున్నాయి. కాని, అవన్నీ పక్కన పెడితే సామాన్య జనం మాత్రం ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు కాళ్లు వణికేలా క్యూలు కడుతున్నారు. అయినా కూడా చాలా మంది దేశం బాగుపడుతుందన్న నమ్మకంతో మోదీకి జైకొడుతున్నారు. కాని, అన్ని పార్టీల్లోని గాలి జనార్దన్ రెడ్డి లాంటి కోటీశ్వరులు మామూలు జనం ఇబ్బందుల్ని పుండు మీద కారం వేసి మండిస్తున్నారు. ప్రతీ వందకి వంద కష్టాలు కామన్ మ్యాన్ పడుతోంటే వీరు మాత్రం గ్రాండ్ గా పెళ్లిల్లు, పేరంటాలు కానిచ్చి ... తమకు తిరుగులేదని వెక్కిరిస్తున్నారు. త్వరలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కూడా ఒకరు తన కొడుకు పెళ్లి కోట్లు గుమ్మరించి చేయబోతున్నాడట! సామాన్యుడు నోరు వెళ్లబెడుతోన్నది... ఈ రాజకీయ డాన్లకి డబ్బులు ఎక్కడ్నుంచీ వస్తున్నాయనే!
కర్ణాటక తరహాలోనే మహారాష్ట్రలోనూ ఒక పొలిటికల్ లీడర్ తన పైత్యం ప్రదర్శించారు. చేసిన ఘనకార్యం ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చెప్పి... మోదీ పరువు, బీజేపి ప్రతిష్ఠా రెండు మంటగలిపాడు. ఇంతకీ ముంబైలోని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రామ్ కదమ్ చేసిన పనేంటంటే... తన కొడుక్కి ఇంకా పద్దెనిమిదేళ్లు నిండక ముందే కోట్లు ఖరీదు చేసే బెంజ్ కార్ కొనిచ్చాడు. నోట్లకు కటకటలాడుతున్న ఈ సమయంలో ఆయనకు అంత డబ్బు ఎలా వచ్చిందన్నది ఒక ప్రశ్న అయితే ఇంకా మైనార్టీ తీరని అబ్బాయికి కార్ ఎందుకు? దాన్ని తీసుకుని ఆ పుత్ర రత్నం యాక్సిడెంట్లు చేస్తే ఎవరిది బాధ్యత? అధికార పక్ష ఎమ్మెల్యేని అడిగేవారెవరు?
ఎమ్మెల్యేగారు కొన్న బెంజ్ తెల్ల డబ్బుతోనే కొని వుండవచ్చు. అయినా కూడా చిన్న పిల్లోడికి కార్ ఏంటి? పైగా ఆ విషయాన్ని కొంచెమైనా ఆలోచన లేకుండా ట్విట్టర్ లో ప్రకటించటం ఏంటి? ఇవన్నీటికంటే ముందు కేంద్రంలోని తమ బీజేపి ప్రభుత్వం నిర్ణయం వల్లే జనం వంద నోటు కోసం రోడ్డున పడి వుంటే... పబ్లిగ్గా ఈ బెంజు కారు డ్రామా ఏంటి? మోదీ పెద్ద నోట్లతో పాటూ ఇలాంటి పెద్ద మనుషుల్ని కూడా పార్టీలకతీతంగా ఒక పట్టు పట్టాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది...
http://www.teluguone.com/news/content/modi-45-69540.html





