Top Stories

విశాఖ జీవిఎంసి లో పడిపోయిన మరో వైసీపీ వికెట్

విశాఖ నగరపాలక సంస్థ లో మరో వైసీపీ వికెట్ పడిపోయింది. గతవారం జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోయిన వైఎస్ఆర్సిపి డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.   దీంతో వైసీపీ డిప్యూటీ పదవిని కూడా కోల్పోయినట్లే. వచ్చే నెలలో మరొక డిప్యూటీ మేయర్ నాలుగేళ్ల పదవి కాలం ముగియడంతో అప్పుడు కూడా మరో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి సభ్యులు నిర్ణయించారు ఇదిలా ఉండగా కేవలం పదవి మాత్రమే కాక వైఎస్ఆర్సిపి పాలనలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు జియ్యాని శ్రీధర్ పాల్పడినట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే దిశలో కూటమి కార్పొరేటర్లు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే అతనితో వ్యాపార సంబంధాలు నెరపే కూటమి నాయకులపై చర్యలు తీసుకుంటామని మూడు పార్టీల అధిష్టానాలూ హెచ్చరికలు జారీ చేశాయి.
విశాఖ జీవిఎంసి లో  పడిపోయిన మరో వైసీపీ వికెట్ Publish Date: Apr 26, 2025 9:32PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభ..కేసీఆర్ ఏమి చెపుతారు?

సర్వత్రా అదే ఉత్కంఠ! భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు సర్వం సిద్దమైంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగే రజతోత్సవ సభ  వరంగల్ జిల్లా  ఎల్కతుర్తి సభా ప్రాంగణం సర్వాంగ సుదరంగా వెలిగి పోతోంది. సభా ప్రాంగణమే కాదు పరిసరాలు మొత్తం గులాబీ మయమయ్యాయి.ఇంచుమించుగా పది లక్షల  మంది  సభకు వస్తారన్న అంచనాలతో  ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏ లోటూ లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగా ఃకుండ.. వైద్య సేవలు, అంబులెన్స్ లు సహా అని సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  మరో వంక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడిన గులాబీ పార్టీ పాతికేళ్ల   పండుగను, ధూమ్ ధామ్ గా, అత్యంత వైభవంగా, నభూతో నభవిష్యత్  అన్న విధంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ గత నెల రోజులకు పైగానే కసరత్తు చేస్తోంది. ఓ వంక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తునారు. సభను ఎలా సక్సెస్ చేయాలనే విషయంలో నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  ఒక్కసారి ఓడిపోయినా, మళ్ళీ వచ్చేది మనమే  అన్న భరోసా ఇస్తున్నారు. నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరో వంక పార్టీ కార్యనిర్వక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇతర ముఖ్యనాయకులు జిల్లాలలో పర్యటించి నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గట్టిగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జన సమీకరణ పై గులాబీ దళం ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఒక విధంగా చూస్తే రజతోత్సవ సభను బలప్రదర్శన సభగా నిర్వహించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   అయితే  రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించడం సహాజమే.  అయితే..  ఎన్నికల సమయంలో లేదా ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తాయి.  అయితే, బీఆర్ఎస్  ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని బల ప్రదర్శన లక్ష్యంగా సభను నిర్వహిస్తోంది  అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదని అంటున్నారు. సమీప భవిష్యత్ లో పంచాయతీ ఎన్నికలు,  వస్తే గిస్తే, ఆ పది నియోజక  వర్గాల ఉప ఎన్నికలు మినహా చెప్పుకోదగ్గ ఎన్నికలు ఏవీ కనిపించడం లేదు.అయినా, బీఆర్ఎస్ పదిలక్షల మందితో భారీ బహిరంగ సభను ఈ సమయంలో ఎందుకు నిర్వహిస్తోంది? ఈ సభ నిర్వహించేందుకు గులాబీ  పార్టీ  ఇంచుమించుగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ..  జరుగుతున్న ఏర్పాట్లు, ప్రచార హోరు చూస్తుంటే, ఇంకొంచెం ఎక్కువే ఖర్చయినా ఆశ్చర్య పోనవసరం లేదని కారు నేతలే అంటున్నారు. అవును.. డబ్బుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే.., ఈ సమయంలో  ఎందుకింత ఆర్భాటం, ఎందుకీ బల ప్రదర్శన అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.  ఆఫ్కోర్స్.. ఒక పార్టీ చరిత్రలో రజతోత్సవాలకు ఉండే ప్రాధాన్యతను, ప్రాముఖ్యతని ఎవరూ కాదన లేరు. నిజానికి  ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లు  మనుగడ సాగించడమే గొప్ప విషయం.   ముఖ్యంగా.. ఒక ఉద్యమ పార్టీగా.. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే సింగల్ పాయింట్ ఎజెండాగా  పుట్టిన పార్టీ పాతికేళ్ళు ప్రస్థానం సాగించడం సాధారణ విషయం కాదు.  అందుకే    బీఆర్ఎస్ గాపేరుమార్చుకున్న టీఆర్ఎస్  రజతోత్సవాలను ఎంత ఘనంగా జరుపుకున్నా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. అందులోన.. ,ఈ పాతికేళ్లలో గులాబీ పార్టీ,రాష్రాన్ని సాధించి, లక్ష్యాన్ని చేరుకోవమే కాకుండా, దేశ  రాష్ట్ర రాజకీయాలను ఎంతో కొంత  ప్రభావితం చేసింది. అవును..  ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా (14 ఏళ్ళు) ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ పోరాటం చేసి రాష్ట్రన్ని సాధించినగులాబీ పార్టీ, పదేళ్ళ అధికార పార్టీగా ఓ వెలుగు వెలిగిన పార్టీ రజతోత్సవాలను జరుపుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ..  కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నికల సభను తలపించే విధంగా లక్షల మందితో సభను నిర్వహించడం  ఎందు కోసం?  దేనికి సంకేతం?  అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. అదొటి అయితే..  రజతోత్సవ సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసేఅర్  ఏమి మాట్లాడతారు?  అనేది   ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు. గడచిన 15- 16 నెలల్లో కేసీఆర్ ఫార్మ హౌస్ గడపదాటి బయటకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక బహిరంగ సభలో ప్రసంగించి కూడా చాల కాలమైంది. ఎప్పుడో  సంవత్సరం సంవత్సరం క్రితం నల్గొండ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో కనిపించారు. అంతే..  ఆ తర్వాత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన లేదు. సో .. సహజంగానే  కేసీఆర్ ఏమి మాట్లాడతారు అన్నది  మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు బీఆర్ఎస్ వారికే కాదు, కాంగ్రెస్, బీజేపీ వారికి, సామాన్య ప్రజలకు కూడా ఆసక్తి కల్గిస్తోంది. అయితే..  విశ్వసనీయ సమాచారం మేరకు  కేసీఆర్... తెలంగాణ ఉద్యమ చరిత్రతో  మొదలు పెట్టి.. బీఆర్ఎస్పదేళ్ళ పాలన,  ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి ప్రసంగించే అవకాశాలే ఎక్కువగా  కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పైనే, కేసీఆర్ ఫోకస్  ఉంటుందని, అంటున్నారు. మరోవంక, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ఏమి మాట్లాడతారు? అనేది కూడా ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు. అలాగే.. ఈ సభ తర్వాత కేసీఆర్ ఏమి చేస్తారు?  బ్యాక్ టూ ఫార్మ్ హౌస్ అంటారా? ముందుండి పార్టీని నడిపిస్తారా అ నేది అన్నిటినీ మించిన  వంద కోట్ల ప్రశ్న.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ..కేసీఆర్ ఏమి చెపుతారు? Publish Date: Apr 26, 2025 8:01PM

సజ్జల.. పిల్ల సజ్జల సరే.. ఈ మూడో సజ్జల ఎవరు?

జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డిని  పోలీసులు శుక్రవారం (ఏప్రిల్ 25) అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై వ్యవహరించి  సకల శాఖల మంత్రిగా, సీఎం జగన్ కు కళ్లు, చెవులూ నోరుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా  సామాజిక మాధ్యమంలో అడ్డగోలు పోస్టులు, అనిచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోయి భ్రష్టుపట్టిన పిల్ల సజ్జల అదేనండి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ  రెడ్డే అందరికీ సుపరిచితులు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం  కుంభకోణం కేసులో అరెస్టయిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అన్న  ఆసక్తి  సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అని చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి తరువాత అరెస్టైన వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి. మద్యం  కకుంభకోణంలో  ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి వసూల్ రాజాగా వ్యవహరించారనీ,  మద్యం తయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా కంపెనీలను వాటిని బెదిరించడం, వసూలు చేసిన కమిషన్లను చేర్చాల్సిన చోటికి చేర్చడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించినది   సజ్జల శ్రీధర్ రెడ్డిది దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. సరే ఇప్పుడు అసలు ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకే వెళ్లాల్సి ఉంటుంది.  జగన్ ప్రభుత్వంలో కీలక ప్రాత పోషించిన, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో  సజ్జల రామకృష్ణారెడ్డి  తన పలుకుబడిని ఉపయోగించి.. తన కుమారుడు  సజ్జల భార్గవ్ రెడ్డి (పిల్ల సజ్జల) సహా తన   మిత్రులు,బందువులు, సన్నిహితులే కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పేలా చర్యలు తీసుకున్నారు. అలాంటి వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సమీపబందువు సజ్జల శ్రీధర్ రెడ్డి  ఒకరు. ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి   నంద్యాల మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డికి అల్లుడు కూడా.  ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ర్. అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే.. శ్రీధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం.2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాతే వైసీపీలో చేరారు. చేరి  మద్యం స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు.  
సజ్జల..  పిల్ల సజ్జల సరే.. ఈ మూడో సజ్జల ఎవరు? Publish Date: Apr 26, 2025 7:54PM

చంద్రగిరిలో ఏనుగుల దాడి.. రైతు మృతి

  తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి.  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం చేశాయి. కొత్తపల్లి సమీపంలో పొలం వద్ద పనిచేసుకుంటున్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు తెలిపారు. శరీరంలోని భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి నెలకొందని తోటి రైతులు చెబుతున్నారు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్యగా గుర్తించారు. వరుస ఘటనలతో రాత్రివేళతో పాటు పగలు సైతం ఆ ప్రాంతాల్లో తిరగాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ని ఏనుగులు తొక్కి చంపడం తెలిసిందే. 
చంద్రగిరిలో ఏనుగుల దాడి.. రైతు మృతి Publish Date: Apr 26, 2025 6:57PM

లిక్కర్ స్కాం బిగ్‌బాస్ జగన్ .. అరెస్టుకు సోమిరెడ్డి డిమాండ్

  ఏపీ లిక్కర్ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.  ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఆ క్రమంలో ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సెట్ అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ స్కాంకి అసలు బిగ్ బాస్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్ అని , ముందు  ఆయన్ని జైలుకు సోమిరెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.  మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని రంగంలోకి దింపాలని అన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి, మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని అన్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ.3200కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయని ఆరోపణలు గుప్పించారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.1.35లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్తా క్యాషాంధ్రగా మార్చారని విమర్శించారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మెక్ డోవెల్స్ కంపెనీని మూసేసుకున్నారని అన్నారు. మొత్తానికి సోమిరెడ్డి చేస్తున్న ’బిగ్‌బాస్ అరెస్ట్‘ డిమాండ్ వైరల్‌గా మారుతోందిప్పుడు
లిక్కర్ స్కాం బిగ్‌బాస్ జగన్ .. అరెస్టుకు సోమిరెడ్డి డిమాండ్ Publish Date: Apr 26, 2025 6:43PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం..గులాబీ మయం అయిన ఎల్కతుర్తి

  బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. గులాబీ దళపతి కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.  500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50 వేల వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్‌, రెడ్‌ కార్పెట్లు ఏర్పాటుచేశారు.   బహిరంగ సభకు ఐదు చోట్లా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా, వాహనాల మళ్లింపు, ఇతర సేవల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 వేల మందికిపైగా వలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు వారికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇచ్చి వాహనాల మళ్లింపుతో పాటు జనాలకు అవసరమైన సేవలందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విద్యుత్తు సరఫరా అందించేందుకు 200కుపైగా జనరేటర్లు పెడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చే కరెంట్ పై తమకు నమ్మకం లేదని, అందుకే 200కుపైగా జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. వైద్య సేవల కోసం బృందాలు సభకు 10 లక్షల మంది వరకు వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా, ఎండల నేపథ్యంలో అక్కడ వందకు పైగా వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.  అంతేగాకుండా ఎమర్జెన్సీ సేవల కోసం 15 అంబులెన్సులు, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నారు. అంతేగాకుండా ఎక్కడికక్కడ తాత్కాళిక టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రజతోత్సవ సభ నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, పార్టీ నేతలు జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జులను నియమించి, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి ఎండ్ల బండ్లతో పాటు పాదయాత్రలతో పార్టీ కార్యకర్తలు ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరారు. రేపు (27వ తేదీ) సాయంత్రం వరకు సభ ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటలలోగా కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని గులాబీ నేతలు సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం..గులాబీ మయం అయిన ఎల్కతుర్తి Publish Date: Apr 26, 2025 6:32PM

దేశంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అణచివేస్తున్నారు : రాహుల్ గాంధీ

  దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలన్ని మాట్లాడనివ్వకుండా గొంతునొక్కేవిధంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని  రాహుల్‌ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. తాను నిన్ననే రావాల్సి ఉన్నా, కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని, అందుకు క్షమించాలని కోరారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర (భారత్ జోడో యాత్ర) చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. తాను కశ్మీర్‌లో యాత్రను ముగించినట్లు గుర్తుచేశారు. ఈ పాదయాత్ర ద్వారా తాను ముఖ్యంగా రెండు విషయాలు నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మా ప్రత్యర్థులు కోపం, భయం, ద్వేషంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు. ఆ విషయంలో వారితో పోటీ పడటం మా వల్ల కాదు. కోపం, భయం, ద్వేషం విషయంలో వారు ప్రతిసారీ మమ్మల్ని అధిగమిస్తారు, ఓడిస్తారు" అని రాహుల్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే  కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దీనికోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే రూ.20 వేల కోట్లు రుణమాఫీ  చేశామని చెప్పారు. అంతకు ముందు శంషాబాద్‌లొ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ హెచ్ఐసీసీకి బయలుదేరారు.  
దేశంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అణచివేస్తున్నారు : రాహుల్ గాంధీ Publish Date: Apr 26, 2025 6:12PM

మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించారు.  బుడగట్లపాలెం సముద్రతీరంలో మత్య్సకారుల వద్దకు వెల్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మత్స్య కారులను ఆదుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని.. ఎన్ని కష్టాలున్నా మీ పరిస్థితి మారుస్తామని తెలిపారు.  ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌ వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసేవారు ఇక్కడి వారే. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే.  ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశాను. నేనూ బటన్‌ నొక్కవచ్చు.. కానీ,  మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలి. ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత ప్రభుత్వ హయాంలో రూ.10లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారు. ఎంపీ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతోందన్నారు.  దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు. రూ. 1990 కోట్లతో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు Publish Date: Apr 26, 2025 5:05PM

కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్. విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డీఆర్ఐ అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో రన్యాతో పాటు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తనను బెదిరించి ఇరికించారని రన్యారావు మొదట చెప్పినట్లు అధికారులు తెలిపారు.  కానీ, డీఆర్ఐ లోతైన దర్యాప్తులో భాగంగా, ఈ బంగారం అక్రమ రవాణాలో రన్యారావు కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలిందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని గట్టిగా వాదించారు.ఈ కేసులో మూడో నిందితుడిగా (ఏ3) ఉన్న ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్‌ను కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బెయిల్ కోసం రన్యారావు చేసిన ప్రయత్నాలు ఇప్పటికే రెండుసార్లు విఫలమయ్యాయి. మరో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితి లేదు. ఆమెపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అధికారులు అభియోగాలు మోపారు. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. రన్యారావుపై కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ , 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది. 
కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ Publish Date: Apr 26, 2025 4:05PM

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా మర్డర్ కేసులో ఫస్ట్ నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ దర్యాప్తులో భాగంగా, వివేకా హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న కసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు నేడు విచారిస్తున్నారు. మొదట తనకు నోటీసులు ఇవ్వలేదని పరమేశ్వర్ రెడ్డి వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను ఇంటి నుంచి పులివెందులలోని విచారణ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. తాజాగా, ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు కూడా సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగన్న మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. సుశీలమ్మను కూడా ఈ రోజు సాయంత్రం విచారించవచ్చని భావిస్తున్నారు.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు Publish Date: Apr 26, 2025 3:32PM

రేపటిలోగా వెళ్లిపోండి.. భాగ్యనగరంలో ఉన్న పాకిస్థానీల‌కు నోటీసులు

  కాశ్మీర్ ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న న‌లుగురు పాక్ పౌరుల‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాల‌తో ఉంటున్న‌ట్లు గుర్తించారు. రేప‌టిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్య‌న‌గ‌రంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్న‌ట్లు పోలీసుల త‌నిఖీల్లో తేలింది.  ఉగ్రదాడి నేపథ్యంలో  భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.  త‌నిఖీలు చేప‌ట్టి పాకిస్థానీల‌ను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లు గుర్తింపు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి డీజీపీ జితేందర్ తెలిపారు. మెడికల్‌ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.
రేపటిలోగా వెళ్లిపోండి.. భాగ్యనగరంలో ఉన్న పాకిస్థానీల‌కు నోటీసులు Publish Date: Apr 26, 2025 3:13PM

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులివ్వలేం : కోర్టు

  నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ పరిణామం సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై క్రిమినల్ విచారణ ప్రారంభించే దిశగా ఈడీ వేసిన కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చార్జిషీట్‌లో ఐదుగురు వ్యక్తులు, రెండు కంపెనీలను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో గాంధీ కుటుంబానికి నియంత్రణ వాటా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థతో పాటు, గాంధీ కుటుంబానికి సన్నిహితులుగా భావించే కాంగ్రెస్ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన లావాదేవీలు, నిధుల మళ్లింపును ధృవీకరించే పత్రాలను కూడా ఈడీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.గత కొన్నేళ్లుగా ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు దివంగత కాంగ్రెస్ కోశాధికారులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లను కూడా ఈడీ గతంలో పలుమార్లు ప్రశ్నించింది  
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులివ్వలేం : కోర్టు Publish Date: Apr 26, 2025 1:09PM

మూడు రోజులు భారీగా ఎండ తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

  తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని సూచించిచారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొవాలని, నిత్యం శరీరానికి నీటిని అందించాలని, ముఖ్యంగా పండ్ల రసాలను తీసుకొవాలని తెలిపారు
మూడు రోజులు భారీగా ఎండ తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ Publish Date: Apr 26, 2025 12:46PM

వంశీని సర్కార్ వేధిస్తోందంట.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన పంకజాక్షి

అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు  పెట్టి  వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్  పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది. ఇంతకీ  ఆ గొంతు ఎవరిదంటే వల్లభనేని వంశీ సీమణి  పంకజాక్షిది. ఔను  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన భర్తపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందంటున్నారు వల్లభనేని  పంకజాక్షి.  ఈ మేరకు ఆమ రాష్ట్ర వర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 25) విజయవాడలోని రాజ్ భవన్ కు  వెళ్లి ఫిర్యాదు చేశారు  తన భర్త వల్లభనేని వంశీ పట్ల కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌ కు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ సందర్భంగా ఆమె వెంట వైసీపీ నేతలు నేతలు  మాజీ మంత్రి పేర్ని నాని,  ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ కూడా ఉన్నారు.  జగన్‌   హయాంలో చంద్రబాబు మీద, లోకేష్‌ మీద, టీడీపీ మీద, నారా భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసు, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో  రిమాండ్‌ ఖైదీగా  ఉన్నారు.
వంశీని సర్కార్ వేధిస్తోందంట.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన పంకజాక్షి Publish Date: Apr 26, 2025 12:34PM

అయితే అటు లేకపోతే ఇటు.. దానం డ్యుయల్ పాలిటిక్స్

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున  పెట్టేలా  తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీఆర్ఎస్ పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 27) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందనీ,  కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇక  కీలక పోస్టులో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైనా దానం పాజిటివ్‌గా స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్‌ హైదరాబాద్‌’ అనే ఎక్స్‌ హ్యాండిల్‌ పోస్ట్‌ చేసిన ఫొటోను స్మితా సబర్వాల్‌ రీపోస్ట్‌ చేశారు. సేవ్‌ హైదరాబాద్‌, సేవ్‌ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్‌ రాక్‌ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. వినిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్‌ ఫొటో అంటూ అభియోగాలు మోపారు.  ఆ మేరకు బీఎన్‌ఎస్‌ 179 సెక్షన్‌ కింద స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్  ద్వారా స్మిత వెల్లడించారు. తన విచారణను పోలీసులు రికార్డ్‌ చేశారని, స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత స్మిత ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. చట్టపరిధిలో పోలీసులకు సహకరించినట్టు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పోలీసులను తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు. ఆ పోస్టును 2వేల మంది రీషేర్‌ చేశారని .. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా.? అని స్పష్టత కోరినట్లు పేర్కొన్నారు . విచారణ తర్వాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.  దాంతో పలువురు కాంగ్రెస్‌ నాయకులు స్మితా సబర్వాల్‌పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.  కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. 10 ఏళ్లలో 13లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడుతున్నారు. స్మితా సబర్వాల్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చెట్లను నరికేస్తే ఎందుకు నోరు  విప్పలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి, ఇపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు. అయితే దానం నాగేందర్ మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయంశమైంది. ఆమె నిజాయితీ గల అధికారి అనీ, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్నారని  దానం కితాబు ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ  నడుస్తంది.  కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్‌ పోస్టులను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తుంటే,  దానం నాగేందర్ మాత్రం  ఆమెకు మద్దతు ప్రకటించడం హాట్ ‌టాపిక్‌గా మారింది. మళ్లీ బీఆర్ఎస్‌ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్న స్మితాకు కితాబు ఇవ్వడం వెనుక అంతర్యం ఏంటని ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వర్గాలూ చర్చించుకుంటున్నాయి. దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లు అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్‌ను పరోక్షంగా సమర్థించడం వెనక వ్యూహం ఏంటన్న చర్చమొదలైంది. కాంగ్రెస్‌లో దానం నాగేందర్‌కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో, బీఆర్ఎస్‌ ప్రస్తావన తీసుకొస్తూ,  ఎమోషనల్ బ్లాక్‌మెయి లింగుకి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఫార్ములా-ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు. ఫార్ములా-ఈ కార్ రేస్‌తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌  పెరిగిందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అలాగే హైడ్రా కూల్చివేతలపైనా విమర్శలు చేశారు. ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారి తీసింది. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ తరుపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దానం తీరులో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారంట. 2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్‌లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో  ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.  ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్‌కు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఓ వైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరగుతుండడం, స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కారు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే అటు లేకపోతే ఇటు.. దానం డ్యుయల్ పాలిటిక్స్ Publish Date: Apr 26, 2025 12:15PM

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్

  ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్రం శుభవార్త  చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి. ఇందులో 70 శాతం గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు 20 శాతం, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు 10 శాతం చొప్పున నిధుల‌ను కేటాయించ‌నున్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఆయా గ్రామ పంచాయ‌తీల బ్యాంక్ ఖాతాల‌కు ఆర్థిక శాఖ అనుమ‌తితో పంచాయ‌తీ రాజ్ శాఖ నిధుల‌ను జ‌మ చేయ‌నుంది. 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను రెండో విడుదగా కేంద్రం నుంచి ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇప్పటికే అమరావతి కోసం భారీగా ప్రత్యేక నిధులు కేటాయించారు
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ Publish Date: Apr 26, 2025 12:04PM

వామ్మో.. కుంకుమ పువ్వు టీ తాగితే ఇన్ని లాభాలా?

  కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంద ద్రవ్యం. దీన్ని సాధారణంగా ఖరీదైన వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీ లోనూ, గర్భవతులు,  బిర్యానీ వంటి వంటకాలలోనూ ఉపయోగిస్తారు. అయితే కుంకుమ పువ్వుతో టీ తయారు చేసుకుని తాగుతారని మీకు తెలుసా? కుంకుమ పువ్వు చాలా ఖరీదైనదే అయినా దాని ఖరీదుకు తగినట్టు ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది.  ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. జీర్ణక్రియ.. కుంకుమ పువ్వు టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్దకం, అజీర్ణం,  కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల ఆహారం  సజావుగా జీర్ణమవుతుంది. నెలసరి.. నెలసరి సమస్యలు ఉన్నవారికి కుంకుమ పువ్వు టీ అద్భుతం అని చెప్పవచ్చు. కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కడుపు కండరాల తిమ్మిరి,  కడుపు ఉబ్బరం,  అలసట, నెలసరికి ముందు, తరువాత వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర.. కుంకుమ పువ్వులో సఫ్రానల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.  ఇవి మనసుకు, మెదడుకు ప్రశాంతతను ఇస్తాయి. పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల మనసు,  శరీరం రెండూ విశ్రాంతి పొందుతాయి. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడేవారు,  పదే పదే నిద్రలో మెలకువ వచ్చే వారు పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగితే చాలా మంచిది. రోగనిరోధక శక్తి.. కుంకుమ పువ్వులో విటమిన్-సి,  విటమిన్-బి,  రిబోప్లేవిన్ వంటి విటమిన్లు ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్.. కుంకుమ పువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  అలాగే మెగ్నీషియం,  పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.  ఇవి రక్తపోటును,  శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు.. ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు టీ ఆకలిని తగ్గిస్తుంది.  తద్వారా కేలరీలు ఎక్కువ తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే కొద్దిపాటి ఫైబర్ చాలా శక్తివంతమైనది. ఇది  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాన్సర్.. కుంకుమ పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి శరీరంలో కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యం.. చర్మ ఆరోగ్యానికి కుంకుమ పువ్వు దివ్యౌషధం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పలు బ్యూటీ ఉత్పత్తులలో కూడా కుంకుమ పువ్వు ను వినియోగిస్తారు. కుంకుమ పువ్వు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.                                        *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
వామ్మో..  కుంకుమ పువ్వు టీ తాగితే ఇన్ని లాభాలా? Publish Date: Apr 26, 2025 11:24AM

తిరుమలలో భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 12 గంటల సమయం

  తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ సాధారణం ఉంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది. శుక్రవారం 64వేల 536 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30వేల 612మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా భక్తులు 3 కోట్ల 36 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.. విద్యాసంస్థలకు వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులు  కలిసి రావటంతో భక్తులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 
తిరుమలలో భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 12 గంటల సమయం Publish Date: Apr 26, 2025 11:07AM

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు.. ముందుముందు మరింత మంది?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని శుక్రవారం(ఏప్రిల్ 25) సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని  విజయవాడకు తరలించారు. శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరచనున్నారు.   ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.  వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షా‌ను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.   అదలా ఉంటే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచిన అధికారులు.. చార్జిషీట్ లో మాత్రం నిందితుడిగా చేర్చారు. దీనిని బట్టి విజయసాయిని అప్రూవర్ గా మార్చేందుకు అధికారులు రంగం సద్ధం చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి  విశ్లేషణలకు వాస్తవమేననడానికి చార్జిషీట్ లో తనను నిందితుడిగా చేర్చినట్లు తెలియగానే.. విజయసాయి మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకూ తనకు తెలిసిన ప్రతి విషయం, ఈ స్కాంతో సంబంధం ఉన్న అందరి  గురించీ చెబుతానంటూ ఓ ట్వీట్ చేశారు.  దీంతో మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి అప్రూవర్ గా మారిపోయారనది అవగతమౌతోందంటున్నారు.  అయితే ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిని పోలీసు అధికారులు విశ్వసించే అవకాశాలు  లేవనీ, తాము దర్యాప్తులో కనుగొన్న అంశాలు, విజయసాయిరెడ్డి చెబుతున్న  అంశాలూ బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆయన నిజాలే చెబుతున్నారని నిర్ధారించుకున్న వరువాత మాత్రమే విజయసాయిని పోలీసులు విశ్వసించే అవకాశం ఉందంటున్నారు.  ఇలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్టైన సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన సమాచారం విజయసాయి  రెడ్డి ద్వారానే పోలీసులకు అందిందంటున్నారు.  లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డి  మద్యం కంపెనీల నుంచి ఉత్పత్తికి తగ్గట్లుగా   ముడుపులు వసూలు చేయడంలో   కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజ్ తో పాటు  ఏ8 చాణక్యను అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. రానున్నరోజులలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు.  
మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు.. ముందుముందు మరింత మంది? Publish Date: Apr 26, 2025 10:28AM

టెక్నాలజీ గురించి పిల్లలు ప్రశ్నిస్తున్నారా? ఇలా స్మార్ట్ గా ఉండండి..!

  ఈ జనరేషన్ ను ఆల్ఫా యుగం అనవచ్చు. ఇది AI, స్మార్ట్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్,  సోషల్ మీడియా మధ్య పెరుగుతోంది. ఈ తరం వారు టెక్నాలజీకి త్వరగా అలవాటు పడతారు,  యాప్‌లతో పాటు వివిధ గాడ్జెట్‌లను ఉపయోగించడంలో వారి తల్లిదండ్రుల కంటే చాలా ముందున్నారు. యూట్యూబ్, గేమింగ్,  ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా దీని పట్టు బలంగా మారింది.  ఇప్పుడు జనరల్ బీటా కూడా మన మధ్య ఉన్నారు. వారు సాంకేతికత అభివృద్ధితో  పెరుగుతారు. ఇది నేర్చుకోవడం, వినోదం కోసం AIని ఉపయోగిస్తుంది. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు పుట్టినప్పటి నుండి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు,  ఇతర గాడ్జెట్‌లతో పరిచయం ఉన్న ఈ పిల్లలు తరచుగా టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు సమాధానం చెప్పకపోతే వారు  నిరాశ చెందుతారు.  సమాధానం చెప్పలేకపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా  బాధపడతారు. కొన్నిసార్లు నిస్సహాయంగా భావిస్తారు.   అపరాధ భావన తల్లిదండ్రులలో  చుట్టుముడుతుంది. కానీ ఇది టెక్నాలజీ యుగం.  పిల్లలకు రోల్ మోడల్‌గా మారాలంటే తల్లిదండ్రులు కూడా  టెక్నాలజీతో కనెక్ట్ అవ్వాలి.  'టెక్నో స్మార్ట్ మామ్'గా మారాలి.  ఇది చాలా సులభం. ఎలాగంటే.. పిల్లలను గురువులుగా చేసుకోవాలి.. సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి సాంకేతికత లేదా సాంకేతిక విషయాలను అర్థం చేసుకోవడం సులభం. అదే సమయంలో సాంకేతికత లేని వ్యక్తికి లేదా ఈ విషయాలపై ఆసక్తి లేని మహిళలకు ఇది కొంచెం కష్టంగా మారుతుంది. నిజానికి కొందరు మహిళలు టెక్నాలజీని ఉపయోగించడం పట్ల భయపడుతున్నారు.  దీనికి కారణం ఏదైనా పొరపాటు చేస్తే నవ్వుల పాలవుతారనే భయం. చాలా మంది తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. పిల్లలు ప్రతి ప్రశ్నకు తమ తల్లి సమాధానం చెప్పాలని ఆశించరు. కానీ వారు కొత్త యాప్ లేదా టెక్నాలజీపై ఆసక్తి చూపినప్పుడు దాని గురించి వారికి ఏమి తెలుసు లేదా దానితో వారు ఏమి చేయాలనుకుంటున్నారో అడగాలి. పిల్లలు పెద్దవారైతే వారి ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని,  దానిని ఎలా సెటప్ చేయాలో,  ఎలా ఉపయోగించాలో చూపించమని అడగాలి. అనేక సర్వేల ప్రకారం 47 శాతం తల్లిదండ్రులు,  సంరక్షకులు తమ పిల్లలకు డిజిటల్ టెక్నాలజీ గురించి తమకన్నా ఎక్కువ తెలుసని భావిస్తున్నారు. కాబట్టి వారిని ఏదైనా అడగడానికి వెనుకాడతారు. నిజంగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారని పిల్లలు భావిస్తే  తమ తల్లిదండ్రులు నిపుణులుగా మారడానికి ట్రై చేస్తున్నారని, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకుని పిల్లలు సంతోషపడతారు. పర్యవేక్షించడం సులభం.. డిజిటల్ యుగంలో సాంకేతికత మనం కమ్యూనికేట్ చేసే, పని చేసే,  పిల్లలను పెంచే విధానాన్ని కూడా మార్చింది. కొంతమంది స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం హానికరమని వాదించవచ్చు. కానీ సాంకేతికత గొప్ప సాధనంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. నేడు అనేక యాప్‌లు,  ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా  పిల్లల మొబైల్ పరికరాలు, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా కార్యకలాపాలు, వారి నిద్ర,  వారి ఆహారాన్ని కూడా పర్యవేక్షించవచ్చు.  పరికరంలో తల్లిదండ్రుల నియంత్రణలను ఉపయోగించడం ద్వారా వారి స్క్రీన్ సమయాన్ని నియంత్రించవచ్చు. దీని కోసం  డిజిటల్  స్టేజ్ ను అర్థం చేసుకోవాలి, అంటే తల్లి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటే, ఆమె ఆన్‌లైన్ భద్రత,  సైబర్ బెదిరింపు వంటి ఇతర ప్రమాదాల గురించి వారిని హెచ్చరించగలదు.  పిల్లలు టెక్నాలజీని సరైన విధంగా  ఉపయోగిస్తున్నారా లేదా అనే దానిపై నిఘా ఉంచగలుగుతారు. ముఖ్యంగా వారు స్మార్ట్‌ఫోన్‌లు,  వీడియో గేమ్‌లకు బానిసలైనప్పుడు ఇది ఉపయోగపడతుంది. కష్టమేమి కాదు.. ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే ఆ మార్గం స్వయంచాలకంగా సృష్టించబడుతుంది. ఐదు సంవత్సరాల క్రితం కూరగాయల నుండి ఇతర రోజువారీ అవసరాల వరకు ప్రతిదీ కొనడానికి డిజిటల్ చెల్లింపులు చేస్తారని ఎవరూ ఊహించలేదు.  కానీ ఇప్పుడు అందరు చేస్తున్నారు.  కోవిడ్ సమయంలో పాఠశాలలు,  కళాశాలలు మూసివేయబడి తరగతులు ఆన్‌లైన్‌లోకి మారినప్పుడు, ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో ఉండే తల్లులు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇలాంటి వాటిని టెక్నాలజీనే సులువు చేసింది. ఉపయోగాలు.. పిల్లలు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. 9 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పిల్లలు ప్రతిరోజూ మూడు గంటలు సోషల్ మీడియా,  గేమింగ్‌లో గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.  ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తల్లిదండ్రులుగా ఉండటం,  సాంకేతికతపై దృష్టి సారించి చర్చలు,  కంటెంట్‌ను పంచుకునే గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా చాలా డవలప్ అవవచ్చు.  నచ్చినది నేర్చుకోవడం ఎల్లప్పుడూ మంచిదని అంటారు. టెక్నాలజీ అనేది ప్రతిరోజూ, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, కానీ  చుట్టూ ఉన్న టెక్నాలజీ గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండటం,  దానిని  అవసరాలకు తగినట్టు మార్చుకోవడం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. టెక్నాలజీని స్వీకరిస్తే రూల్ మోడల్ అవుతారు..  టెక్నాలజీకి భయపడాల్సిన అవసరం లేదు.  పిల్లలకు ఆదర్శంగా నిలిచేందుకు ఇది తల్లులకు ఒక అవకాశం.  టెక్నీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ టెక్నాలజీని  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మంచి విషయం ఏమిటంటే అది అంత కష్టం కాదు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తల్లిగా మారడం ద్వారా  పిల్లలకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా సాంకేతికత  చెడు ప్రభావాల నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలను కూడా తీసుకోవచ్చు. దీని కోసం సాంకేతిక రంగం వైపు మొదటి అడుగు వేయడం ముఖ్యం. అంటే పిల్లలను వారి స్వంత ఉపాధ్యాయులుగా మార్చడం.  ఇది వారితో తల్లులకు గల సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా వారు అనేక ముఖ్యమైన నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ ఆచరిస్తే స్మార్ట్ మామ్ అవుతారు.                                   *రూపశ్రీ.  
టెక్నాలజీ గురించి పిల్లలు ప్రశ్నిస్తున్నారా? ఇలా స్మార్ట్ గా ఉండండి..! Publish Date: Apr 26, 2025 9:30AM

హాం ఫట్.. అధికారుల భూమ్ ఫట్

  అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.  ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించి సంచలనమ మారిన వివదాన్నే తీసుకుంటే, తెలంగాణ హై కోర్టు ఈ కేసులో చాలా కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసులో, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారంతా, ఉన్నత స్థానాల్లో ఉన్న,ఉన్నతాదికారులని,అలాగే, వారిపై  రోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్ర హై కోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటే, పెద్ద సార్లు, భూదందాలో ఎంతటి సమర్ధులో  వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, రాష్ట్ర హై కోర్టు’ రాష్ర వ్యాప్తంగా భూదాన భూముల దురాక్రమణలు, అక్రమాల పై విచారణ జరిపి నిజాలను నిగు తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ సంసిద్ధంగా ఉందా, లేదా తెలియచేయాలని సిబిఐకి నోటీసులు జారీ చేసింది.అంతే కాదు, ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వంతో పాటు ఇడి, సిబిఐ, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు,వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,వారి కుటుంబసభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది.  పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే సిబిఐ లేదా ఇడి వంటి స్వతం త్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అం శంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గు రు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది.  నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదని గతంలోనే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అక్రమ సంపాదనతో, బినామీ పేర్లతో  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పెద్ద సార్లు ఐఎఎస్,ఐపీఎస్’లు,ఉన్నారని,అంటున్నారు. అవునుమ నలుపును తెలుపు చేసుకునేందుకు, కాకుంటే, గుట్టుచప్పుడు కాకుండా దోచిన సొమ్ములను దాచుకునేదుకు పెద్ద సార్లు,రియల్ వ్యాపారాన్ని నమ్ముకునారని అంటారు. నిజానికి బయటకు వస్తున్నది, చాలా తక్కువ అంటున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబద్’ సహా అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో, కొండకచో ఇతర రాష్ట్రాల్లోనూ, పెద్ద సార్లు రియల్’ దందాను దిగ్విజయంగా నడుపుతున్నారనే ఆరోపణలకు కొదవ లేదు. అయితే, అంతిమంగా ఏమి జరుగుతుంది, ఆవినీతికి సంకెళ్ళు పడతాయా అంత అనుమానమే అంటున్నారు
హాం ఫట్.. అధికారుల భూమ్ ఫట్ Publish Date: Apr 25, 2025 10:06PM

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి : సీఎం రేవంత్ రెడ్డి

  పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని ఆయన తెలిపారు.ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారని ఆయన పేర్కొన్నారు. దుర్గామాత భక్తుడైన ప్రధాని మోదీ ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బాధితులకు సంఘీభావం తెలపాలని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి : సీఎం రేవంత్ రెడ్డి Publish Date: Apr 25, 2025 9:18PM

వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌

  వక్ఫ్‌ సవరణ చట్టంను సమర్థిస్తూ మోదీ సర్కార్  సుప్రీంకోర్టు లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్‌ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది. కాకపోతే పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా సమగ్రమైన, లోతైన, విశ్లేషణాత్మక అధ్యయనం అనంతరమే వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేశామని తెలిపింది. గతంలో ఉన్న నిబంధనలతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం జరిగిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.  ఈ మేరకు 1332 పేజీలతో దాఖలు చేసిన ప్రాథమిక కౌంటర్‌ అఫిడవిట్‌లో ఈ చట్ట సవరణలను సమర్థించుకుంది. 2013 తర్వాత ఆశ్చర్యకరంగా వక్ఫ్‌ భూమి భారీగా పెరిగిందని పేర్కొంటూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ షేర్షా సీ షేక్ మొహిద్దీన్ అఫిడవిట్ దాఖలు చేశారు. వక్ఫ్‌ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 72 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు దీనిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం అయితే అప్పటివరకు వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.  
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ Publish Date: Apr 25, 2025 8:02PM

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..అమరావతి నిర్మాణ పనులపై చర్చ

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా. రూ.లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ.. పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును అందించాలని ప్రధానిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే రోజున దాదాపు 30 వేల మందితో ఒక రోడ్‌షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..అమరావతి నిర్మాణ పనులపై చర్చ Publish Date: Apr 25, 2025 7:47PM

పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తమ ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు ప్రధాని మోదీ, సీఎంచంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. స్వారత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. "అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం" అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  పిఠాపురం మున్సిపాలిటీకి రూ.3 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న హామీల అమలును ముందుకు తీసుకెళ్లున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.
పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి  డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం Publish Date: Apr 25, 2025 5:06PM

వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు.. ఒకే జైలు.. ఒకే బ్యారక్

వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో  ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్మలానీని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు సెల్స్‌లో రిమాండ్‌లో ఉన్నారు.  తెలుగుదేశం కార్యాలయ సిబ్బంది కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే  చాలా రోజులుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తాజాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరి తర్వాత ఒకరు ఇదే జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చారు.  ఈ ముగ్గురినీ కూడా ఒకే బ్యారక్ లోని వేరువేరు సెల్స్ లో జైలు అధికారులు  ఉంచారు.   ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్‌లో ఉండటంతో జైలు అధికారులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. వారి కదలికలను పర్యవేక్షించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురి సెల్స్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వేర్వేరు కేసుల్లో అరెస్టయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్‌లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా వల్లభనేని వంశీ, పీఎస్సార్ ఆంజనేయులు మధ్య గతంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవని చెబుతారు. మొత్తం మీద జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ముగ్గురు ప్రముఖులు.. ఆ సమయంలో తాము చేసిన చర్యల కారణంగా అరెస్టై ఒకే జైలులో ఒకే బ్యారక్ లో ఉండటం కాకతాళీయమే అయినా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు.. ఒకే జైలు.. ఒకే బ్యారక్ Publish Date: Apr 25, 2025 4:50PM

అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు

  జమ్ముకశ్మీర్‌‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ చంద్రమౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా.. భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. ఈ రోజు చంద్ర మౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోధించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.  అలాగే మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడి మోసారు. అశృనయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జ్ఞానాపురం స్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధువులు, వేలాదిగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్‌ పార్థివ దేహానికి నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మధుసూదన్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.          
అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు Publish Date: Apr 25, 2025 4:34PM

జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం

పాక్ పని అవుట్ ! భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఎప్పుడో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి చాలా చరిత్ర వుంది. నిజానికి ఉభయ దేశాల మధ్య యుద్దాలు, ఉద్రిక్తలు , సరిహద్దు ఘర్షణలు వంటి అనేక ఆటు పోట్లను ఎదుర్కుని ఇంతవరకూ సజీవంగా నిలిచిన ఒప్పందం ఏదైనా ఉందంటే  అది 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక్కటే. అయితే ఇప్పడు ఆ  పవిత్ర  బంధం కూడా పుటుక్కుమంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు, జమ్మూకశ్మీర్‌లో అత్యంత హేయమైన ఉగ్ర దాడికి పాల్పడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మన దేశం సింధూ జలాల ఒప్పందానికి  చెల్లు చీటి రాసింది. నిజానికి గతంలోనూ అనేక సందర్భాలలో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వుంది. నిజానికి దేశాల మధ్యనే కాదు, రాష్ట్రాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందాలు నిత్య కలహాలకు కారణం అవుతున్న తీరును చూస్తున్నాం. ఎక్కడి దాకానో ఎందుకు, నిన్న మొన్నటి వరకు కలిసున్న ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరీ జలాల పంపకాలకు సంబంధించిన ఒప్పందాల  ఉల్లంఘనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అనేకం ఉన్నాయి. రైతులు, రాజకీయ పార్టీలు కత్తులు దూసుకున్న సందర్భాలూ  ఉన్నాయి.   అలాగే..  ఇంకా అనేక ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య కూడా జల జగడాలు సాగుతున్నాయి. అయితే.. భారత ,పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక చారిత్రిక ఒప్పందంగా చరిత్రలో మిగిలి పోయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీ జలాల పంపిణీ ఒప్పందాలలో ఒకటిగా  నిలిచింది.  చరిత్రలోకి వెళితే.. 1960లో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో భారత్‌-పాక్‌ ఈ ఒప్పందం పై సంతకాలు చేసాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్‌, చీనాబ్‌ నదుల నీరు పాకిస్థాన్‌కు దక్కింది. ఇవి కాకుండా బియాస్‌, సట్లెజ్‌ జలాలు కూడా వెడుతుంటాయి. ఇక మన దేశం భూభాగంలో ప్రవహించే నదీ జలాలను  ప్రవహించే నీటిని మనం వాడుకోవచ్చును. కానీ, జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడుకుని..  మళ్ళీ పాక్ కు వదిలేయాలే కానీ..  ఆ నీటిని నీటిని సాగు, తాగు ప్రయోజనాలకు వాడుకోరాదు.  నిజానికి ఎగువన ఉన్న దేశంగా మనం ప్రాజెక్టులు కట్టుకుని, నీటిని నిల్వ చేసుకున్నా.. మళ్ళించి మన అవసరాలకు వాడుకున్నా..  పాకిస్థాన్ గొంతు తడవదు. పంట పొలాలు నీరు  అందదు.  పాకిస్థాన్ నీటి అవసరాలకు 80 శాతం వరకూ  ఈ ఒప్పంద పరిధిలో అందుతున్న నీరే  ఆధారం. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే..  సింధూ జలాల ఒప్పందమే పాకిస్థాన్  ను బతికిస్తున్నది. ఆదే  ఆ దేశానికి జీవాధారం, జీవనాధారం. పాకిస్థాన్ నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది.  ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్‌ వ్యవసాయానికి వాడే నీటిలో  80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే.  16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. సింధూ బేసిన్‌ నుంచి పాక్‌కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్‌ఏఎఫ్‌) నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. పాకిస్థాన్‌ ఇప్పటికే తీవ్రమైన నీటి కరవులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధ్వాన స్థితికి చేరింది. భూగర్భజలాలు పడిపోతున్నాయి.  పాకిస్థాన్‌ విద్యుత్ కు కీలకమైన మంగల డ్యామ్‌ను జీలమ్‌ నదిపై నిర్మించారు.  ఏటా ఆ దేశ విద్యుత్తు ఉత్పత్తిలో 8 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్‌ పాక్‌ వినియోగంలో 16 శాతానికి సమానమైన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా సింధూ జలాల ఒప్పందంతో పాక్‌లో 24శాతం జల విద్యుత్ పై ప్రతికూల ప్రభావం పడనుంది. పాకిస్థాన్‌ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చును.  అయితే మన దేశం ఒప్పందం నిలిపివేసినా.. పాకిస్థాన్ పై తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని..  గతంలో సింధూజలాల కమిషనర్‌గా పనిచేసిన ప్రదీప్‌కుమార్‌ సక్సెనా  వంటి నిపుణులు అంటున్నారు. అవును. మన దేశం తీసుకున్న కఠిన  నిర్ణయం ప్రభావం  పాక్‌పై తక్షణమే పడకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాంకేతికంగా సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి.. మళ్లించడానికి తగిన వసతులు లేవు.  అయిత డ్యాముల నిర్మాణానికి ఇంతవరకు ఉన్న అవరోధాలు   ఈ నిర్ణయంతో తొలిగి పోతాయి. కానీ..  తక్షణం నిర్మాణాలు చేపట్టినా, అవి పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.  అలాగే..  ప్రస్తుత ఉద్రిక్తలు కొంత సర్డుమణిగిన  తర్వాత,  ప్రపంచ బ్యాంకు,  లేదా ఎ అమెరికానో పట్టుకుని ఒప్పందాన్ని పునరుద్దరించుకో వచ్చనే ఆలోచనతో పాక్ నేతలు ఉన్నారని అంటున్నారు. మరోవంక భారత ప్రభుత్వం దీన్నొక అవకాశంగా తీసుకుని, పాకిస్థాన్  ఉగ్ర చర్యలకు జలాస్త్రంతో సమాధానం చెప్పాలని కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.
జలాస్త్రమే.. బ్రహ్మాస్త్రం Publish Date: Apr 25, 2025 4:30PM

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం

  ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు, చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కానీ నిందితులు ఎవరనేది ఇప్పటి వరకూ స్పష్టంగా కనిపెట్టలేకపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు.  పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ వేగవంతం చేశారు. ప్రకాశంలోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరయ్య చౌదరి ఛాతీ, గొంతు, పొట్లపై పదిహేను కత్తి పోట్లు పొడిచారు. అనంతరం పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.   
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం Publish Date: Apr 25, 2025 3:36PM

జగన్ అరెస్ట్ ఫిక్స్?.. అప్పగింతలు అందుకేనా?

వైసీపీ కీలక నాయకులు, వారి సన్నిహితులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వరుసగా కేసులు, అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్నికలు ముగియగానే మాచర్ల మాజీ  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం తాజాగా రాజ్ కసిరెడ్డి, సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయుల వరకూ సాగింది. ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. కాగా లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్  కసిరెడ్డి అరెస్టుతో ఈ అరెస్టుల ఎపిసోడ్‌కి సీక్వెల్   ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే లిక్కర్ స్కాంపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కర్త-కర్మ-క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డే అని చెప్పి కలకలం రేపారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు. విదేశాల్లో కసిరెడ్డికి పలు వ్యాపారాలు, ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయంట. ఆ అనుభవంతో  రాజ్ కసిరెడ్డి జగన్ కు బాగా దగ్గరై, లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలున్నాయి. విజయసాయి రెడ్డి నోటి వెంట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రావడంతో ఆయన సడన్‌గా ఫోకస్ అయ్యాడు  ఐటీ సలహాదారుగా ఉంటూనే కసిరెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి లిక్కర్ అక్రమ దందా నడిపించారని అధికారుల విచారణలో తేలింది.  ప్రభుత్వం నడిపే మద్యం అవుట్‌లెట్‌లకు ఊరుపేరు లేని మద్యం బ్రాండ్ల సరఫరాను రాజ్ కసిరెడ్డి నియంత్రించారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రత్యేక కార్యాలయం నుండి ఎంపి మిధున్‌రెడ్డితో కలిసి మొత్తం కిక్‌బ్యాక్ నెట్‌వర్క్‌ను నడిపించిన కసిరెడ్డి ఇప్పుడు జైలుపాలయ్యారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి , అప్పటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవ రెడ్డిలకు సిట్ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.  ఈ కేసులో జగన్‌కు అత్యంత ఆప్తుడైన మిధున్‌రెడ్డి ఏ4 నిందితుడిగా బుక్ అయ్యారు. దాంతో ఇక నెక్ట్స్ జగన్ వంతే అన్న టాక్ వినిపిస్తోంది. మద్యం తయారీదారుల నుంచి నెలనెలా కసిరెడ్డి వసూలు చేసిన రూ.60 కోట్ల కమీషన్లు మిథున్‌రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని జనగ్  ప్యాలెస్‌కు చేరేవన్న ఆరోపణలున్నాయి. విచారణలో కసిరెడ్డి ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉండటంతో జగన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందంట. అందుకే  గత పదేళ్ళలో ఎన్నడూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించని జగన్ తాజాగా ఇటీవల 33 మందితో  వైసీపీకి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని నియమించారు.  జగన్ జైలుకెళ్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన  భార్య భారతి పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించాలి. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా ఆయనకు ఎప్పుడో దూరమయ్యాయి. ఇక పార్టీలో నెంబర్2 అనిపించుకుని వైసీపీ ఆవిర్భావం నుంచి అన్ని వ్యవహారాలు తానై చక్కబెట్టిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుని జగన్‌కి గుడ్‌బై చెప్పేశారు.  విజయసాయిరెడ్డి ఎఫెక్ట్‌తో అసలే అక్రమఆస్తుల కేసుల టెన్షన్‌లో ఉన్న జగన్‌ మెడకు ఇప్పుడు లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. జగన్ జైలుకెళ్తే బయటవారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పే ప్రసక్తే  ఉండదు. ఎందుకంటే ఆయన సొంత చెల్లెల్నే నమ్మరు. కాబట్టి రాజకీయ అనుభవం లేకపోయినా భారతే ఆయనకు దిక్కవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను పొలిటికల్‌గా గైడ్ చేయడం కోసం పార్టీలో ఉన్న సీనియర్లందరితో కలిసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీతో వరుస మీటింగులు కూడా నిర్వహిస్తున్నారంట. ఆ పీఏసీకి తనకు అత్యంత నమ్మకస్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డినే కన్వీనర్‌గా పెట్టుకున్నారు. సొంత మీడియాలో కూడా భారతికి చేదోడువాదోడుగా ఉంటున్న సజ్జలే రేపు జగన్ జైలుకి వెళ్లాక భారతికి రాజకీయ సహయకుడిగా కూడా కొనసాగుతారని జగన్ నమ్మకంతో ఉన్నారంట.
జగన్ అరెస్ట్ ఫిక్స్?.. అప్పగింతలు అందుకేనా? Publish Date: Apr 25, 2025 3:34PM