రేవంత్‌రెడ్డికి షాక్.. శ్రీధర్‌బాబు జంప్!.. కేటీఆర్‌తో మంతనాలు అందుకేనా?
Publish Date:Feb 11, 2022
Advertisement
తెలంగాణ రాజకీయాలలో కారెక్కి కండువా కప్పుకోవడం చాలా సాధారణ విషయంగా మారింది. అందుకే, ఇద్దరు వేర్వేరు పార్టీల నాయకులు ఏ పెళ్లిలోనో, విందులోనో కలిసినా, పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నా, అది వార్తయి కూర్చుంటుంది. మీడియాలో చర్చలు మొదలవుతాయి ... ఆ ఇద్దరిలో ఒకరు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగి పోతుంది. అందులోనూ తెరాస, కాంగ్రెస్ నాయకులు కలిస్తే కాంగ్రెస్ నాయకుడు కారెక్కేసినట్లే, బ్రేకింగులు వచ్చేస్తాయి. అఫ్ కోర్స్ అదేమీ, పూర్తి అసత్యం కాదనుకోండి. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 18 మందిలో 12 మంది తెరాస తీర్ధం పుచ్చుకున్నారు కాబట్టి. ఎవరైనా అలా అనుకుంటే అనుకోవచ్చును. అలాగే, గత ఎనిమిది ఏళ్లలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో మాక్సిమం కాంగ్రెస్ నుంచి తెరాసలోకే కరిగాయి కాబట్టి, నిజం అయినా కాకపోయినా, ఈ రెండు పార్టీల నాయకులూ కలిస్తే , అది నిజమే అనుకోవడం అలవాటుగా మారిపోయింది. అదలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తెరాస ‘టచ్’లోకి వెళ్ళారనే వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. అయితే, విషయం ఏమంటే, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్, బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని ఫోటోలు సైతం తీసుకున్నారు. అంతే,ఇంకేముంది, నిజానికి ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఇదిగో తోక అంటే అదిగో పులి అనే సోషల్ మీడియాలో శ్రీధర్ బాబు కారెక్కుతున్నారా? అంటూ క్వశ్చన్ మర్క్ కథనాలు మొదలయ్యాయి. అంతే కాకుండా, గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు,పాడి కౌశిక్ రెడ్డి, పెళ్లి విందులోనే కేటీఆర్ ‘టచ్’ లోకి వెళ్ళారని, చివరకు గులాబీ కండువా కప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు. అలాగే, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీలో అంత కంఫర్టబుల్’ లేరని చాలా కాలంగా వార్త లొస్తున్నాయి. ఆలాగే, పీసీసీ పదవిని ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డి బయట పడినంతగా, శ్రీధర్ బాబు బయట పడక పోయినా, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. సో .. ఏమి జరిగినా జరగ వచ్చనే మాట కూడా వినవస్తోంది. ప్రస్తుతానికి అయితే, ఇద్దరి మధ్య మాట కలిసింది,మనువు కుదిరిందా లేదా అనేది,ముందుముందు గానే తెలవదు. గతంలో కోమటి రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క, జగ్గా రెడ్డి విషయంలో కూడా ఇలాగే, పుకార్లు షికార్లు చేశాయి. అయినా , రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారా లేదు కారెక్కలేదు. ఇది నిజం.
http://www.teluguone.com/news/content/mla-sridharbabu-talks-with-ktr-39-131618.html





