మమత వర్సెస్ సువేందు.. భవానిపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ!
Publish Date:Apr 28, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, బుధవారం (ఏప్రిల్ 29) రెండో, చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి ఎలాగైనా బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అదలా ఉంచితే బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతం మమతా బెనర్జీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే, ఈసారి ఈ కోటను బద్దలు కొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక పోతే.. భవానీపూర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించిన సువేందు, మరోసారి ఆమెను సొంత గడ్డపై సవాల్ చేస్తున్నారు. దీంతో ఈ పోరు కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, ఇద్దరు నేతల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాలను ఈ సారి ఎన్నికలలో బీజేపీ ప్రచారాస్త్రాలుగా సంధిస్తే.. సంక్షేమ పథకాలు, బెంగాలీ సెంటిమెంట్‌తో మమతాబెనర్జీ ప్రచారాన్ని హోరెత్తించారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 4న విడుదల అవుతాయి.
http://www.teluguone.com/news/content/mamata-vs-suvendu-39-218509.html





