మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం : లోకేష్
Publish Date:Jun 24, 2026
Advertisement
ఏపీలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలోని మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగడ్డ పల్లెపాలెంలోని నాయుడు వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి మౌనిక, సింగోతు సుధీర్, సతీమణి శివపార్వతితో పాటు ఎస్.నరసింహస్వామి, కే.మశేన్ రావులతో మాట్లాడారు. వల విసిరి చేపల వేట పులిగడ్డలోని మత్స్యకార కుటుంబాలతో కలిసి వేణిపాయలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. బోట్ల తయారీ, వినియోగం, చేపట వేట, అమ్మకం, ఆదాయం, కుటుంబ స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసాపైనా మంత్రి ఆరా తీశారు. పడవ కొనుగోలుకు రూ.2.50 లక్షలు చిన్న పడవల కొనుగోలుకు ఒక్కో పడవకు రూ.2.50 లక్షలు, పెద్ద పడవకు రూ.7.50 లక్షల వరకు వ్యయం అవుతుందని మత్స్యకారులు మంత్రికి వివరించారు. ఇక్కడపెద్ద బోట్లు నడవవని, చిన్న బోట్లను మాత్రమే వినియోగిస్తామని తెలిపారు. నెల్లూరులో బోట్లు తయారీ ఉందని వివరించారు. ఉదయం 2 నుంచి 3 గంటల సమయంలో చేపల వేటకు బయలుదేరి 9 గంటలకు తిరిగివస్తామని తెలిపారు. వలల్లో 15 రకాలు ఉంటాయని, వలలో పడిన చేపలను స్థానిక కంపెనీలకు విక్రయిస్తామన్నారు. కుటుంబానికి నెలకు రూ.20వేల వరకు సంపాదన ఉంటుందని, గ్రామంలో 300 మంది వరకు మత్స్యకారులు ఉన్నారని చెప్పారు. తమ గ్రామంలో ప్రస్తుతం రిజిస్టరైన చిన్న బోట్లు 60,, పెద్ద బోట్లు 15 వరకు ఉన్నాయని వివరించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లలు చదువుతున్నారని మత్స్యకారులు తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్ స్వయంగా వలవేసి చేపలను పట్టారు. ఆయిల్ సబ్సిడీ పెంచాలి తాము వినియోగించే బోట్లకు గత కొన్నేళ్లుగా లీటర్ డీజిల్ పై రూ.9 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందని, దీనిని రూ.25 నుంచి రూ.30 వరకు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. వలలు, బోట్లు, ఇంజన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వరదల సమయంలో ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్స్, రాత్రి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటుచేయాలని కోరారు. మత్స్యకార కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర జువ్వలదిన్నెకు చేరుకున్నప్పుడు మత్స్యకారుల ఐకమత్యం, చూపించిన ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంపునకు కృషి చేస్తామని, ప్రజాప్రభుత్వంలో అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-36-224055.html





