రాష్ట్రంలో వందలకోట్లు దండుకుంటున్న మెడికల్ మాఫియా
Publish Date:Mar 12, 2012
Advertisement
హైదరాబాద్: మద్యం మాఫియాపై నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్న మాఫియాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి మాఫియాల్లో మెడికల్ మాఫియా ఒకటి. ప్రభుత్వ ఆంక్షలు, నియమ నిబంధనలు లేకపోవడంతో ఈ మెడికల్ మాఫియా రాష్ట్రంలో దర్జాగా వందలాది కోట్ల రూపాయలు దోచుకుంటుంది. 10రూపాయలు కూడా విలువచేయని మందులపై 90 నుంచి 100 రూపాయలు ఎమ్మార్పీ ముద్రిస్తునారు. వీటి ధరలకు నియత్రణ లేకపోవడంతో రోగులు నష్టపోతున్నారు. రూపాయి వస్తువుకు 10 రూపాయల ఎమ్మార్పీ నిర్ణయిస్తున్న మెడికల్ కంపెనీలు మధ్యలో వైద్యులకు, అధికారులకు ముడుపులు, ఏజెన్సీలకు, డాక్టర్లకు మార్జిన్లు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. రాష్ట్రంలో సుమారు ఏటా రూ.8000 కోట్ల విలువైన ఔషధాలను విక్రయిస్తున్నట్లు అంచనా. అయితే ఈ రూ.8000 కోట్ల విలువైన మందులను తయారీకి అయ్యే ఖర్చు కేవలం వెయ్యికోట్లు రూపాయలు, మిగిలిన రూ.7000 కోట్ల రూపాయలు రోగులనుంచి దండుకొని వివిధ దశల్లో షాపుల యజమానులు, మందుల తయారీదారులు, డాక్టర్లు, అధికారులు అనుభవిస్తున్నారు. ఔషధాల ధరల నియంత్రణ, పర్యవేక్షణకు మనదేశంలో సరైన చట్టాలు లేవు. దీన్ని ఆసరాగా చేసుకుని మందుల తయారీదారులు రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారు. లాభాలకు అలవాటుపడిన కొంతమంది యజమానులు ఎందుకూ పనికిరాని నాశిరకం మందులను, డూప్లికేట్ మందులను కూడా మార్కెట్లో ప్రవేశ పెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మందులు వికటించి చనిపోతున్నవారి సంఖ్య కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉంది. మద్యం మాఫియాను తలదన్నే విధంగా రాష్ట్రంలో మెడికల్ మాఫియా వేళ్ళానుకుని ఉంది. దీన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
http://www.teluguone.com/news/content/medical-mafia-24-12554.html





