మండలిలో లోకేశ్ విశ్వరూపం.. కొడాలి నాని, వంశీకి ఇక దబిడిదిబిడే!
Publish Date:Nov 14, 2024
Advertisement
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ చర్యలతో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌కు వెన్నులో వణుకుపుడతోంది. పోలీసులు ఎవర్ని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియక చాలామంది రహస్య ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో టీడీపీ, జనసేన నేతలు, వారి కుటుంబాల్లోని ఆడవారిపై పోస్టులు పెట్టారు. వారిలో అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ ప్రముఖుడు రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులిచ్చారు. మరోవైపు శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళిలపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాడేపల్లిలోని జగన్ నివాసానికి కొద్దిదూరంలో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయాన్ని ఏర్పాటుచేసి పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ సూచనలతో ఈ అసభ్యపోస్టుల తంతు నడిచేదని తేలింది. వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నెలవారి జీతాలు అందించి టీడీపీ, జనసేన నేతలపై అసభ్య పోస్టులు పెట్టించేవారని తేలింది. మరోవైపు వైఎస్ షర్మిళ, విజయమ్మ, సునీతలపై ఎంపీ అవినాశ్ రెడ్డి సూచనలతో ఆయన పీఏ ద్వారా వచ్చిన కంటెంట్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసేవాడినని పోలీసుల విచారణలో వర్రా రవీంద్రరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. వర్రా రవీంద్రరెడ్డిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించిన పోలీసులు.. ఎంపీ అవినాశ్ రెడ్డి, సజ్జల భార్గవ్ లపైనా కేసులు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా జగన్ మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందన్న వాదన ఉండటంతో ఆ మేరకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు సోషల్ మీడియాలో అసభ్యకరంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పోస్టులు, ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తే ఎవర్నీ వదిలి పెట్టేదిలేదని స్పష్టం చేశారు. అయితే, శాసన మండలిలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై వైసీపీ సభ్యులు అభ్యతరం తెలిపారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, వైసీపీ నాయకులను జైళ్లకు పంపించేందుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుంటుందంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా పారిపోయారంటూ టీడీపీ సభ్యులు ఎద్దేవా చేశారు. దీంతో బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు పారిపోలేదా? అంటూ నిలదీశారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యాడు. గత ప్రభుత్వంపై చంద్రబాబు రెండేళ్లు సభలో ఉండి పోరాడిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. నా తల్లిని అవమానించడంతోనే సభ నుంచి ఆయన చాలెంజ్ చేసి వెళ్లిపోయారన్నారు. ఈ సమయంలో జగన్ కుటుంబంపై కూడా అన్నారని కొంత మంది వైసీపీ సభ్యులు అనడంతో.. వారికి లోకేశ్ గట్టిగా రిప్లయ్ ఇచ్చాడు. తాము జగన్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. తన తల్లిని అసెంబ్లీ వేదికగా అవమానించారని వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాడు. వైఎస్ షర్మిల, విజయమ్మలపైనా అసభ్యకర పోస్టులు పెట్టారని, అలాంటి వారిని అరెస్టు చేయకుంటే ఏం చేస్తారని లోకేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఆవేశాన్ని చూసి వైసీపీ సభ్యులు చర్చను పొడిగించలేదు. నారా భువనేశ్వరిని కించపరిచిన వారిని తాము ప్రోత్సహించబోమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నికల్లో టికెట్ ఎలా ఇచ్చారని, అలా చేస్తే వారిని ప్రోత్సహించినట్లే కదా అంటూ లోకేశ్ ప్రశ్నించడంతో.. వైసీపీ సభ్యులు నోరు మెదపలేదు. మొత్తానికి నారా భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని మండలి వేదికగా లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, వారి అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ అరెస్టులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. అయితే, పలు కేసుల్లో కొందరు వైసీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. కొడాలి నాని, వంశీల జోలికి మాత్రం ఇప్పటి వరకు వెళ్లలేదు. పార్టీ కార్యాలయంపై దాడి కేసు విషయంలో వంశీపై మాత్రమే కేసు నమోదైంది. అయితే, వారిద్దరూ తెలుగుదేశంలోని కీలక నేతల ద్వారా చంద్రబాబు, లోకేశ్ వద్దకు రాయబారాలు నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమను క్షమించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని వారు తెలుగుదేశం ముఖ్య నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శాసన మండలిలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కొడాలి నాని, వంశీ, వారి వర్గీయుల్లో భయాందోళను రేకెత్తిస్తున్నాయి. లోకేశ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిద్దరిని వదిలిపెట్టరని, వారు జైలుకెళ్లడం ఖాయమని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కొడాలి నాని, వంశీ అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ముందుగా వారిద్దరిని అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను చంద్రబాబు, లోకేశ్ వద్ద పలువురు తెలుగుదేశంనేతలు ఇప్పటికే తీసుకువచ్చారు. రెడ్‌బుక్ చాప్టర్-3 త్వరలో ఓపెన్ అవుతుందని, అందులో కొండాలి నాని, వంశీ పేర్లు ఉంటాయని సమాచారం.
http://www.teluguone.com/news/content/lokesh-fire-in-mandali-25-188377.html





