దీదీ చేజారిన తృణమూల్!?
Publish Date:Jun 6, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహా సంక్షోభం తలెత్తింది. పదిహేనేళ్ల పాటు రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ రాజకీయ హైడ్రామాలో మొత్తం ఉన్న 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మంది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు పక్షాన నిలిచారు. ఈ రెబెల్ వర్గం అంతా ఏక తాటిపైకి వచ్చి ప్రత్యేక క్యాంప్ నిర్వహించడమే కాకుండా.. శాసనసభలో తామే అసలైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందారు. పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీకి ఈ 58 మంది శాసనసభ్యుల మద్దతు ఉండటంతో.. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఆయన్ను అధికారికంగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. 15 ఏళ్లపాటు తిరుగులేని అధికారంలో ఉన్న మమతకు ఇది కోలుకోలేని గట్టి దెబ్బ అనడంలో సందేహం లేదు. అయితే ఈ తిరుగుబాటు వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ అసమ్మతి జ్వాలలు మమతా బెనర్జీపై కంటే.. ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా పార్టీలోని సీనియర్ నేతలను పక్కనపెట్టి.. అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయించడంపై పార్టీ నేతల్లో లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. ఎన్నికల ఓటమితో ఆ అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. రెబెల్స్ క్యాంప్‌లోని మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆమెను ప్రధాన సలహాదారు పాత్రకు పరిమితం కావాలంటున్నారు. మరోవైపు 23 మంది టీఎంసీ ఎంపీలు కూడా ఈ తిరుగుబాటు వర్గంతో చేతులు కలిపినట్లు సమాచారం. ఈ భారీ సంక్షోభం నుంచి పార్టీని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం (జూన్ 5) తన నివాసంలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రీతబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమవారం (జూన్ 8) నాడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని మమత నిర్ణయించారు. అంతేకాకుండా.. పార్టీలో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేసేందుకు వీలుగా బెంగాల్‌లోని అన్ని కీలక రాష్ట్ర కమిటీలతో పాటు ఫ్రంటల్ సంస్థలను దీదీ రద్దు చేశారు. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తరహాలోనే ఇప్పుడు బెంగాల్‌లో కూడా పార్టీ పేరు, గుర్తు కోసం కోర్టుల్లో న్యాయపోరాటం జరగే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/trinamool-congress-slipping-out-mamatha-hands-25-222009.html





