ఏరులై పారుతున్న మద్యం.. బహిరంగంగానే పంపిణీ!
Publish Date:Oct 23, 2023
Advertisement
రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా.. మందు అంటే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే దొరికేలా చేస్తా. అమ్మల్లారా.. అక్కల్లారా వింటున్నారా.. ఇదీ మీ బిడ్డ జగన్ ఇస్తున్న హామీ. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి చూపిస్తా అంటూ గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పారు. మాట ఇస్తే చేస్తాడంతే అంటూ వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. మాట తప్పడు.. మడమ తిప్పడు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాకా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు. మద్యపాన నిషేధం హామీని మరవడమే కాకుండా కొత్త కొత్త కంపెనీలను తెచ్చి ఏ మాత్రం ప్రామాణికాలు లేకుండా క్వాలిటీలేని మద్యంతో ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా జీవోలు తెచ్చి మద్యాన్నితన ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వైసీపీ నేతలే ఇప్పుడు గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రజల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇక, ఇప్పుడు అదే నాసిరకం మద్యాన్ని వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉచితంగా పంపిణీ చేస్తూ ఓట్లుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ వై నాట్ 175 అన్న నినాదాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా గెలుపొందుతామని వైసీపీ ప్రగల్భాలు పలికింది. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలను చూసిన వైసీపీ ఈ నినాదాన్ని పక్కన పెట్టింది. కానీ, కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి పోటీ చేయించాలని భావిస్తున్న జగన్.. ఆయనకు ఆర్ధికంగా కూడా అండగా ఉంటూ వస్తున్నారు. భరత్ ఏది అడిగితే అది చేసేలా వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్ పవర్ ఇచ్చారు. దీంతో పోలీసు, రెవెన్యూ అంతా భరత్ కనుసన్నల్లోనే మెలిగేలా చేసుకున్నారు. కాగా, ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ గా కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇదే ఆదునుగా భావిస్తున్న వైసీపీ కుప్పాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ముందుగా చంద్రబాబు అవినీతిపరుడని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో నియోజకవర్గంలో భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభలకు హాజరయ్యే వారికి సకల ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో సభ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ తమ వైపుకు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు జనాలను బలవంతంగా తరలించి వారికి భారీగా మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు.. సమావేశం అనంతరం సభా ప్రాంగణంలోనే భారీగా మందు పంపిణీ చేయడం విశేషం. ఈ సభకు వచ్చే మార్గాలలో కూడా వందలాది మందికి బహిరంగంగానే మద్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫోటోలు చూస్తున్న నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన మద్యపాన నిషేధం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ తెచ్చిన చీప్ లిక్కర్ మద్యంతో ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. మాట తిప్పడు మడమ తిప్పడు అంటూ మైక్ దొరికితే భజన చేసే మంత్రి రోజా తదితరులకు ఈ వీడియోలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. మీరు మంత్రిగా ఉండి కూడా మీ జిల్లాలోనే ఇలా బహిరంగంగా ప్రజలకు ఉచితంగా మద్యం పంపిణీ చేస్తుంటే మీ కళ్ళు మూసుకుపోయాయా అంటూ రోజాను ట్యాగ్ చేస్తూ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. మీరు ఎంతగా ఇలా బజారు కెక్కితే అంతగా నష్టం పెరుగుతుందే తప్ప చంద్రబాబును ఓడించడం మీ తరం కాదంటూ తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/liquor-distribution-in-kuppam-39-163846.html