బాలినేని vs సుబ్బారెడ్డి.. తీగ లాగితే అక్రమాల బాగోతం బయటపడిందా?
Publish Date:Oct 23, 2023
Advertisement
బాలినేని శ్రీనివాస రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఈ రెండు పేర్లు చెప్పగానే మనకి గుర్తొచ్చేది సీఎం జగన్ మోహన్ రెడ్డే. ఈ ఇద్దరూ జగన్ కు దగ్గరి బంధువులే. వైవీ సుబ్బారెడ్డి వైఎస్ జగన్ కు వరసకు చిన్నాన్న కాగా.. బాలినేని బంధువుతో పాటు జగన్ కాంగ్రెస్ తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న రోజులలోనే ఆయనతో నడిచిన వారిలోఒకరు. అందుకే సుబ్బారెడ్డిని జగన్ టీటీడీ చైర్మన్ ను చేస్తే.. బాలినేనికి జగన్ తొలి క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. కాగా సుబ్బారెడ్డికి మరోసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తే.. బాలినేనిని మాత్రం రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి నుండి తప్పించారు. అదే సమయంలో అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కేబినెట్ లో కొనసాగించారు. దీంతో అప్పటి నుండే బాలినేని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వైసీపీలో ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలో రెబల్ గా వాయిస్ వినిపిస్తున్నారు. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. ఆ మధ్య తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో మీడియా ముఖంగా వైసీపీ పెద్దలపై విరుచుకుపడిన బాలినేని.. తన వాళ్లపై సప్సెన్సన్ ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని, పోలీసుల నుండి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికీ తన మాట అంటే లెక్కలేకుండా పోయిందని ఆవేశాన్ని వెళ్లగక్కారు. దీంతో పలుమార్లు వైసీపీ పెద్దలు బుజ్జగించి బాలినేనిని కూల్ చేస్తూ వస్తున్నారు. నిజానికి ఇక్కడ వైసీపీలో బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు కలిసి చేసిన ఓ భూ ఆక్రమణల కుంభకోణం బాలినేని చేతికి చిక్కింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలినేని.. ఈ కుంభకోణంలో ఎంతటి వారున్నా వదలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, పోలీసులు బాలినేనిని లెక్కచేయకుండా సుబ్బారెడ్డికి మద్దతుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలినేని పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అనుచరులు కొందరు నకిలీ పట్టాలు తయారు చేసి భూవివాదాలకు పాల్పడ్డారు. ఈ ముఠా చాలా పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడింది. బాలినేని ఫిర్యాదుతో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. కానీ, ఈ కేసులో పోలీసులు అసలు వారిని వదిలేసి కొసరు వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును తప్పు దోవ పట్టించారని..ఆరోపిస్తూ అందుకు నిరసనగా బాలినేని సెక్యూరిటీని సరెండర్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అధిష్టానం పెద్దలు ఎలాగోలా బాలినేని కూల్ చేశారు. కానీ, అసలు ఈ భూ కుంభకోణం ఏంటి అన్నది మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒంగోలులో వెలుగు చూసిన ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణం ఒక్క ఒంగోలుకు పరిమితమవలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారసులు దగ్గర్లో లేని ఆస్తులను, ఎలాంటి అండా లేని వృద్ధుల ఆస్తులను, పలుకుబడి లేని వారి ఆస్తుల్ని ముఠా టార్గెట్ చేసి.. అప్పటికప్పుడు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బెదిరింపులకు దిగేవారనీ. త్రుణమో పణమో ఇచ్చింది తీసుకుని తమకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో వారిని మేనేజ్ చేయగా.. పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ సివిల్ కేసులని దాటవేయడంతో బాధితులు ముఠాకి లొంగిపోయి వారు చెప్పినట్లు తలొగ్గేవారని అంటున్నారు. ఈ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్వవస్థలన్నీ వ్యవస్థీకృతంగా కలిసి ఈ కుంభకోణానికి తెరతీసినట్లు తెలుస్తున్నది. ఇది ఒక్క ఒంగోలులో మాత్రమే కాదని రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కేసును ఏ దర్యాప్తు సంస్థకు ఇచ్చేది లేదని.. తామే ‘లోతు’గా దర్యాప్తు చేస్తామని ఏపీ పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ కుంభకోణం నీరుగారిపోవడం గ్యారంటీ అని టాక్ నడుస్తుంది.
http://www.teluguone.com/news/content/balineni-versus-yvaubbareddy-39-163844.html