మద్యం సిండికేట్లపై ఏసీబీ కొరడా
Publish Date:Jan 27, 2012
Advertisement
హైదరాబాద్: గతనెలలో మద్యం సిండికేట్‌పై ఏసీబీ జరిపిన సోదాలతో మొదలైన రాజకీయ చిచ్చు ఇంకా ఆరనేలేదు. నాటి దాడులకు సంబంధించిన నివేదికలను బయట పెట్టనే లేదు. అంతలోనే ఏసీబీ మళ్లీ పంజా విసిరింది. ఒకవైపు ఎమ్మార్పీ ఉల్లంఘన, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, నకిలీ మద్యం, బెల్టు షాపుల నుంచి వచ్చే ఆదాయం! మరోవైపు ఎక్సైజ్ అధికారులకు, ప్రజాప్రతినిధులకుమీడియా ప్రతినిధులకు మామూళ్లు! ఈ రెండు కోణాలకు సంబంధించిన సమాచారంతో ఏసీబీ అధికారులు సుమారు 750 పేజీల నివేదిక తయారు చేశారు.గత నెలలో జరిపిన సోదాల సమాచారం ఆధారంగానే దీనిని రూపొందించారు. 15 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేసుకుని వీటికి సమాధానాలు రాబట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. స్థానిక పంచాయతీరాజ్ సిబ్బంది నుంచి సమాచారం సేకరించి రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మద్యం సిండికేట్ల కార్యాలయాలపై దాడులకు దిగారు.ఏసీబీ డీజీ భూపతిబాబు పర్యవేక్షణలో సుమారు 50కి పైగా బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభం కాగా తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో పది గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించారు. ముడుపులు పుచ్చుకున్న పోలీస్, ఎక్సైజ్, మునిసిపల్, తూనికలు, కొలతల విభాగం, మీడియాతోపాటు ప్రజాప్రతినిధులపైనా కేసులు నమోదు చేయవచ్చని తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో 420 దుకాణాలు ఉండగా... అందులో వందకుపైగా ఒక సిండికేట్‌లో ఉన్నాయి. వీటిని ఒకే ఎమ్మెల్యేకు చెందిన బినామీలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.10 లక్షల నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న లక్ష్మీనాయక్, నెల్లూరు జిల్లా కోవూరు సీఐ విజయకుమార్ తదితరులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.అయితే గత నెల 13వ తేదీన కరీంనగర్ పట్టణంలో ఎక్సైజ్ శాఖ అధికారులు 3,62,640 రూపాయలతో ఏసీబీకి పట్టుబడడంతో సిండికేట్ల డొంక కదిలింది. ఇక్కడ దొరికిన వివరాల ఆధారంగా విశాఖపట్నం, విజయనగరం సహా మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. ఎవరెవరికి ఎంతెంత మామూళ్లు చెల్లించారు? ఎందుకు చెల్లిస్తున్నారు? వంటి వివరాల పద్దులను ఖాతా పుస్తకాలను, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఎమ్మార్పీ ఉల్లంఘనతో వచ్చిన ఆదాయంతోపాటు నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, నకిలీ మద్యం విక్రయాలు, లూజ్ సేల్స్, బెల్టుషాపుల ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తున్నట్టు గుర్తించారు.
కాగా సోదాల్లో లభించిన ఆధారాలను బట్టి సిండికేట్ల నిర్వాహకులు, అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. "ఎక్సైజ్ సిబ్బందిని మభ్యపెట్టి వారి విధులను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు' అని సిండికేట్ ప్రతినిధులను లంచాలు తీసుకున్నందుకు అధికారులను అరెస్టు చేయనన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/likkar-sindicate-24-11323.html





