తెలంగాణను వణికిస్తున్న కోల్డ్ వేవ్: హైదరాబాద్ పై చలిపులి పంజా.!
Publish Date:Oct 27, 2026
Advertisement
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. వర్షా కాలంలో సైతం తీవ్ర వేడి, ఎండ, ఉక్కపోతతో సతమతమైన జనం, ఇప్పుడు చలికి వణికి పోతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది. ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో, తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది. సాయంత్రం నుంచే చలి ప్రభావం చూపుతోంది. నగర శివారు ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం హైదరాబాద్ పటాన్ చెరులో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 13.9 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్లో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక పోతే.. శేరిలింగంపల్లిలో 14.2, కూకట్పల్లిలో 14.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట సాధారణ ఎండ, ఉక్కబోత కనిపిస్తున్నప్పటికీ, సూర్యాస్తమయం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్, డిసెంబర్ నెలల సమీపిస్తున్న కొద్దీ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తగిన అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
[Cold Wave Telangana, Hyderabad, cold Weather Patancheru, Temperature Drop, Telugu One]
http://www.teluguone.com/news/content/cold-wave-telangana-24-235479.html




