పేద మహిళలే టార్గెట్: సరూర్ నగర్ లోఅండాల అక్రమ సేకరణ దందా గుట్టురట్టు.!
Publish Date:Oct 31, 2026
Advertisement
విశ్వనగరం హైదరాబాద్ లో వైద్య నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం బెంబేలెత్తిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ నెట్వర్క్ గుట్టురట్టయింది. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక నివాసంలో అసాధారణ కార్యకలాపాలు సాగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు శనివారం (అక్టోబర్ 31) ఆకస్మికంగా ఆ నివాసంపై దాడి చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అక్కడ అనుమానాస్పద రీతిలో తలదాచుకున్న 18 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ విద్యార్థినులు, నిరుపేద యువతులుగా గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించి, ఈ ముఠా సభ్యులు వారి బలహీనతను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వారి అండాలను (Oocytes) సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఇలా సేకరించిన అండాలను నగరంలోని అనధికారిక ఐవీఎఫ్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ మొత్తాలకు విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. బేగంపేట, ప్రకాష్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ గ్యాంగ్‌ల గుట్టు రట్టయిన గంటల వ్యవధిలోనే సరూర్‌నగర్‌లో మరో అక్రమ దందా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్న యువతులను విచారిస్తున్నారు. ఈ అక్రమ నెట్వర్క్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు, ఏయే ప్రముఖ ఆసుపత్రులు, ఐవీఎఫ్ సెంటర్లు ఈ ముఠాతో చేతులు కలిపాయి అనే కోణంలో లోతైన దర్యాప్తు ముమ్మరం చేశారు. [Saroornagar Illegal Oocyte Donation Racket, Police Busted, Oocyte Scam, Telugu One]
http://www.teluguone.com/news/content/saroornagar-illegal-oocyte-donation-racket-24-235920.html




