కేటీఆర్ అరెస్టేనా?
Publish Date:Jan 15, 2025
Advertisement
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం (జనవరి 16) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టులో, ఆ తరువాత బుధవారం (జనవరి 15) సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రేపు ఈడీ విచారణకు హాజరు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయి. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం గం.10.30లకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే నంది నగర్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ప్రదర్శనగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా ఈ సీన్ కనిపించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ సారి ఈడీ విచారణకు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
విచారణ తరువాత కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ భయంతోనే కేటీఆర్ బలప్రదర్శనకు రెడీ అయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేటీఆర్ అరెస్టు అనివార్యమైతే ఏసీబీ అరెస్టు చేస్తే బెటరని భావిస్తున్నారు. ఈడీ అరెస్టు చేస్తే బెయిలు రావడం కష్టమనీ, అదే ఏసీబీ అరెస్టు చేస్తే బెయిలు ఒకింత తొందరగా వస్తుందనీ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈడీ విచారణ తరువాత కేటీఆర్ అరెస్టు అవుతారన్న భయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్టపీసు కేసు అంటూ పదేపదే చెబుతూ వచ్చిన కేటీఆర్ కు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. దీంతో కేటీఆర్ చెబుతున్నట్లు ఇది లొట్టపీసు కేసు కాదని సామాన్యులు కూడా భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ktr-to-attend-ed-inquiry-39-191327.html