తెలంగాణ చరిత్రలో విలన్ కాంగ్రెస్ పార్టీనే: కేటీఆర్
Publish Date:Nov 29, 2026
Advertisement
సోనియమ్మ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావనే లేదు.! తెలంగాణ ఉద్యమ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ పాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై, సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల సోనియా గాంధీ ఏదో పుస్తకం రాసినట్లు పత్రికల్లో చూశానని పేర్కొన్న కేటీఆర్.. సిక్కుల ఊచకోత, ఎమర్జెన్సీ ఘటనలపై కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసినట్లుగానే తెలంగాణ ఉద్యమంపై కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుందని ఆశించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది యువకుల గురించి సోనియా గాంధీ కనీసం ఒక్క మాటైనా చెబుతారని భావించామని కేటీఆర్ అన్నారు. 'తప్పయింది.. నేను చేసింది తప్పు' అని ఆమె అంగీకరిస్తారని ఆశించామని, కానీ ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన కూడా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మన చరిత్రను మనం చెప్పుకోకపోతే, మన కథను మనం తెలుసుకోకపోతే ఇతరులు చరిత్రను వక్రీకరించే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ జాతి కథను, తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను ప్రజలే చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. సింహం తన కథను తాను చెప్పుకోకపోతే.. వేటగాడు చెప్పే పిట్టకథలే నిజమని భావించే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పార్టీదే ప్రతికూల పాత్ర అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఎన్ని యుగాలు గడిచినా తెలంగాణ చరిత్రలో విలన్ కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, సోనియా గాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవతగా అభివర్ణించారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల ప్రాణాలు పోవడానికి కారణమైన వారే.. ఇప్పుడు ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. అమరవీరుల ఆత్మలు క్షోభించేలా కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి ఉందని ఆరోపించారు. జలియన్ వాలాబాగ్ ఘటనలో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత బ్రిటిష్ పాలకులే సంతాప సభ నిర్వహిస్తే ఎంత విడ్డూరంగా ఉంటుందో.. తెలంగాణ ఉద్యమ అమరవీరుల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం కూడా అంతే విడ్డూరంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను ప్రజలు మర్చిపోకూడదని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: నవంబర్ 29 లేకపోతే తెలంగాణ లేదు.. రేవంత్ సీఎం అయ్యేవారా: హరీశ్ రావు
మీకు నచ్చవచ్చు: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. ఆ పోరాటం మరువలేనిది: కేటీఆర్
KTR, Sonia Gandhi, Revanth Reddy, Telangana Movement, BRS, Telangana Martyrs, Telangana History, Congress, KTR Speech, Telangana Politics.
http://www.teluguone.com/news/content/ktr-24-238203.html




