నవంబర్ 29 లేకపోతే తెలంగాణ లేదు.. రేవంత్ సీఎం అయ్యేవారా: హరీశ్ రావు
Publish Date:Nov 29, 2026
Advertisement
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోయి ఉంటే రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల వద్ద, చంద్రబాబు అడుగుజాడల్లో తిరిగేవారని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ఆవిర్భావానికి నవంబర్ 29 నాంది పలికిందని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో నిర్వహించిన సభకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించిన ఆయన.. సిద్దిపేట అభివృద్ధికి కనీసం రూ.50 పైసలైనా ఇచ్చారా? అంటూ సీఎంను నిలదీశారు. సభల నిర్వహణకు పెట్టే ఖర్చుపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రాజెక్టుకు పొక్క పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రాముడి పాలన పోయి రాక్షస పాలన వచ్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నవంబర్ 29ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నట్లుగానే.. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన డిసెంబర్ 9 ప్రకటనను గుర్తుచేసుకుంటూ విజయ దివస్‌గా జరుపుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కేసీఆర్ పోరాటం, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. మీకు నచ్చవచ్చు: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. ఆ పోరాటం మరువలేనిది: కేటీఆర్ మీకు నచ్చవచ్చు: ప్రధాని నివాసంలో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక భేటీ.!
[ Harish Rao, KCR, Revanth Reddy, Deeksha Diwas, Telangana Movement, BRS, Siddipet Meeting, December 9 Vijay Diwas, Nagarjuna Sagar ]
http://www.teluguone.com/news/content/harish-rao-24-238201.html





