'409'వర్తించదని కోనేరు వాదన..తిప్పికొట్టిన సీబీఐ
Publish Date:Jan 9, 2012
Advertisement
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణంలో అరెస్టయిన కోనేరు ప్రసాద్ కొత్త వాదనను ముందుకు తెచ్చారు. బెయిలుకు అడ్డంకిగా మారిన 409 ఐపీసీ తనకు వర్తించదనే వాదన ప్రారంభించారు. ఇది రెండు కార్పొరేట్ సంస్థల మధ్య జరిగిన లావాదేవీ అని, దీనితో ప్రభుత్వానికి సంబంధం లేదని, విశ్వాస ఘాతుకానికి పాల్పడే పబ్లిక్ సర్వెంట్స్‌పై ప్రయోగించాల్సిన ఐపీసీ 409 సెక్షన్‌ను తనపై ప్రయోగించడం చెల్లదని అన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కోనేరు వాదనను సీబీఐ తరఫు న్యాయవాది రవీంద్ర నాథ్ తిప్పికొట్టారు. "ఏపీఐఐసీ ప్రభుత్వ సంస్థ. ఈ కార్పొరేషన్ భాగస్వామిగా ఉన్న ఎమ్మార్‌లో మీరు డైరెక్టరుగా ఉన్నారు. ఏజెంటుగా కూడా బాధ్యతలు నిర్వహించి విల్లాలు, ప్లాట్లు విక్రయించారు. ఈ క్రమంలో రూ.138 కోట్లు స్వాహా అయ్యాయి. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టులో సర్కారుకు వాటా ఉంది. అది పబ్లిక్ ప్రాపర్టీ. అందువల్లే నిందితులపై 409 సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి''
409 సెక్షన్‌పై అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చునని దర్యాప్తు ఒక దశ వరకు వచ్చాక ఆ సెక్షన్ గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు. కోనేరు తరపున చెన్నై నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది బి.కుమార్ తన వాదనలు వినిపించారు. "కోనేరు ప్రసాద్‌కు బెయిలు రాకుండా జైలులో ఉంచాలనే ఆయనపై 409 సెక్షన్ కింద కేసు పెట్టారు. రెండు కార్పొరేట్ సంస్థల మధ్య లావాదేవీలు జరిగినప్పుడు 409 సెక్షన్ వర్తించదు. 60 రోజుల్లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనందున, కోనేరుకు బెయిలు మంజూరు చేయండి'' అని జడ్జిని అభ్యర్థించారు. దీనికి సీబీఐ న్యాయవాది -'ప్రజాధనం దుర్వినియోగమైనందునే ఆ కేసు నమోదు చేశారు. అది వ్యక్తికి వ్యతిరేకంగా నమోదు చేసినది కాదు. నేరానికి బాధ్యులైన వారందరికీ అదే వర్తిస్తుంది'' అని చెప్పారు.అని సీబీఐ న్యాయవాది రవీంద్రనాథ్ అన్నారు.గాలి జనార్దన్‌రెడ్డి లాయర్ కూడా 409పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు కోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేశారు. " మొత్తం రూ.138 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలింది'' అని కోర్టుకు వివరించారు. విల్లాలు, ప్లాట్లు కొన్నవారు అనధికారికంగా చెల్లించిన సొమ్ములో కొంత మొత్తం కోనేరు ప్రసాద్ కుమారుడి ఖాతాలో కూడా జమ అయిందని తెలిపారు. ఇన్ని అక్రమాలు జరిగినందునే ఐపీసీ 409 సెక్షన్ ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. విచారణను జడ్జి నాగమారుతీ శర్మ 12వ తేదీకి వాయిదా వేశారు.
http://www.teluguone.com/news/content/koneru-prasad-24-10807.html





