సీఎం రేవంత్ రెడ్డి వచ్చాకే అన్ని విషయాలు మాట్లాడుతా : మంత్రి కొండా సురేఖ
Publish Date:Aug 21, 2026
Advertisement
చెప్పాల్సింది నిన్ననే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పాను..! కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు..! ఇటీవల తలెత్తిన వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల అంశంపై మంత్రి కొండా సురేఖ తొలిసారి నోరు విప్పారు. పార్టీ అధిష్ఠానానికి సంబంధించిన క్రమశిక్షణా కమిటీకి తాను ఇవ్వాల్సిన వివరణను ఇప్పటికే పూర్తి స్థాయిలో సమర్పించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో బహిరంగంగా కొత్తగా మాట్లాడటానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం చేపట్టిన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి స్థాయిలో మాట్లాడతానని ఆమె చెప్పారు. ఈ వివాదానికి ప్రధాన మూలం గీసుకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ పరిణామాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కుమార్తె చేసిన సంచలన వ్యాఖ్యల ఆధారంగా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ద్వారా కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు పంపారు. అయితే, దీనిపై మంత్రి స్పందిస్తూ.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నట్లు సమాచారం. ఆ వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో తనను బాధ్యురాలిని చేయవద్దని కోరుతూ కమిటీకి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం షోకాజ్ నోటీసులకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా గాంధీ భవన్‌లో బలంగా సాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుండటంతో ఆయన తిరిగొచ్చిన తర్వాత జరిగే భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రితో చర్చలు పూర్తయిన అనంతరం మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress Showcause Notice, Konda Susmitha Comments, Telangana Politics
http://www.teluguone.com/news/content/konda-surekha-24-229505.html





