సభలోనూ గవర్నర్‌కు చెక్ పెడతారా? కేసీఆర్ తీరుతో సంక్షోభం తప్పదా?
Publish Date:Feb 25, 2022
Advertisement
రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్. కేసీఆర్‌కు తమిళిసైకు మధ్య కోల్డ్‌వార్. ఈ రెండు రాజ్యాంగ హోదాల మధ్య సత్సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తమిళనాడుకు చెందిన బీజేపీ కీలక నేత తమిళిసైను తెలంగాణ గవర్నర్‌గా నియమించడం సీఎం కేసీఆర్‌కు అసలేమాత్రం ఇష్టం లేదు. బహుషా అందుకే కాబోలు.. ఆమె రాజ్‌భవన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయింది. గతంలో నరసింహన్‌కు ఎంతగా ప్రాధాన్యం ఇచ్చేవారో.. తమిళిసైను అంతగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తుండటం విమర్శల పాలవుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ మరో దుందుడుకు చర్యకూ సిద్ధమవుతున్నారని అంటున్నారు. మరో 10-15 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ జరగాల్సి ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి.. గవర్నర్ ప్రసంగంతో సభా కార్యక్రమాలు ప్రారంభం కావాలి. అదీ విధానం. కానీ, ఈసారి కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? గవర్నర్ ప్రసంగానికి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? తమిళిసైకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ.. తమిళిసై స్థాయిని తగ్గించాలని ఈసారి గట్టి పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం, ఉభయ సభల సమావేశం, మేడమ్ అనుమతి.. తదితర నిబంధనలు తప్పకుండా పాటించాలా? వాటికి వేరే అల్టర్‌నేట్స్ ఉన్నాయా? అనే దిశగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు నిపుణులతో ఆరా తీస్తోందని సమాచారం. ఇప్పటి వరకైతే రాజ్‌భవన్ వర్గాలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి బడ్జెట్ సెషన్ అప్‌డేట్స్ లేవని.. గవర్నర్ ప్రసంగ ప్రిపరేషన్ సైతం మొదలు కాలేదని తెలుస్తోంది. అయితే, గవర్నర్‌ను కాదని.. రాజ్యాంగ సంప్రదాయాల విషయాలను మార్చే ప్రయత్నం చేస్తే.. మొదటికే మోసం వస్తుందని.. కొన్ని పదవులను, కొన్ని సంప్రదాయాలను గౌరవించాల్సిందేననేది కొందరి సూచన. కాదూ కూడదని.. సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకెళ్తే.. బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ కీలక పాత్రను తగ్గించాలనో, అసలు లేకుండానో చేయాలని చూస్తే.. అదే జరిగితే.. తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను ఇటీవల కాలంలో మరీ డమ్మీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. గతంలో నరసింహన్ టైమ్‌లో నెలకోసారి వెళ్లినట్టు రాజ్‌భవన్ వెళ్లేవారు ముఖ్యమంత్రి. తమిళిసై వచ్చాక రాజ్‌భవన్‌కు వెళ్లి పాలనా విషయాలు, ప్రభుత్వ అంశాలు.. గవర్నర్‌కు బ్రీఫింగ్ చేసే విషయాన్ని పూర్తిగా తగ్గించేశారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా.. తమిళిసై పలు అంశాల్లో స్వచ్చందంగా వ్యవహరిస్తుండటం కేసీఆర్‌కు నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే, తనకు అనుకూలంగా లేనంత మాత్రాన.. మరీ ఇంతలా పక్కన పెట్టేయడం మంచి విషయం కాదంటున్నారు. కొవిడ్ సాకు చెప్పి.. రిపబ్లిక్ డే నాడు రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి డుమ్మా కొట్టారు కేసీఆర్. ఏదైనా ప్రొగ్రామ్‌కు గవర్నర్ హాజరైతే.. అక్కడకు కేసీఆర్ వెళ్లట్లేదు. ఎలాంటి వేదికనైనా గవర్నర్‌తో కలిసి పంచుకునేందుకు ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదు. ఇక, ఇటీవల మేడారం జాతరను గవర్నర్ తమిళిసై దర్శించారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ వెళ్లి మేడమ్‌కు స్వాగతం పలకాల్సి ఉంది. కానీ, ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఆదేశాలతో కలెక్టర్ కాకుండా జాయింట్ కలెక్టర్‌తో గవర్నర్‌కు వెల్‌కమ్ చెప్పించి ఆ పదవినే అవమానించారని అంటున్నారు. ఇక, మేడారం టూర్‌కు హెలికాప్టర్ అరేంజ్ చేయమని రాజ్‌భవన్ నుంచి రిక్వెస్ట్ వచ్చినా.. లైట్ తీసుకుందట ప్రభుత్వం. ఇలా అడుగడుగునా తమిళిసైతో వ్యవహారం తెగేదాకా లాగుతున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రి తీరుపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు. ఇక, బడ్జెట్ సెషన్‌లోనూ గవర్నర్ ఔనిత్యాన్ని తగ్గించాలని చూస్తే.. ఢిల్లీ నుంచి సీరియస్ యాక్షన్ తప్పకపోవచ్చని చెబుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల విషయంలో సీఎం కేసీఆర్ తీరు మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మరి, జగమొండి కేసీఆర్ వింటారా? తగ్గుతారా? రాజ్‌భవన్‌తో రాజీ కొస్తారా? రచ్చ కంటిన్యూ చేస్తారా?
http://www.teluguone.com/news/content/kcr-steps-against-governer-tamilsai-39-132305.html





