గ్రాఫ్ గల్లంతు.. అందుకే ఎగుర్లు..!
Publish Date:Feb 17, 2022
Advertisement
‘చెప్పే వాడికి వినేవాడు లోకువ’ ఇదొక సామెత. ముఖ్యంగా వేదిక లెక్కి ఉపన్యాసాలు ఇచ్చే ‘పెద్దలు’, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ సామెతను చాలా నిష్టగా ఫాలో అవుతుంటారు. అవును. రాజకీయాల్లో అతిశయోక్తులు ఉంటాయి ... ఉండాలి కూడా. అయితే గీత దాటితే బొక్క బోర్లా పడక తప్పదని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. అయినా, కొంత మంది రాజకీయ నాయకులు, ‘తా దూర కంత లేదు, మెడకో డోలు’ అన్నట్లుగా ఉన్నచోట ఉండకుండా ఎగిరెగిరి బొక్కబోర్లా పడడం చూస్తూనే ఉన్నాము. అలాగే, మింగ మెతుకు లేక పోయినా, మీసాలకు సంపెంగ నూనే రాసే బాపతు రాజకీయ నాయకులు కూడా రోజు రోజుకు పెరిగి పోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత హడావిడి చేసిందో చూశాం. ఎవరో వాళ్ళూ వీళ్ళు కాదు, ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి, బీజీపీ వ్యూహకర్త, అమిత షా ... ఎన్నికల తర్వాత బెంగాల్లో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఎంతో ధీమాగా ప్రచారం సాగించారు. కమల దళం ఖాతాలో 200 ప్లస్ సీట్లు ఖాయం అని ఊదర కొట్టారు. చివరకు ఏమైందో చూశాం. బీజేపీ సీట్ల సంఖ్య వంద దాటదని, దాటితే ఎన్నికల వ్యూహకర్త వ్యాపారాన్ని వదిలేసు కుంటానని అమిత్ షాకు సవాలు విసిరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లే, బీజేపీ వంద లోపు సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కాబట్టి, రాజకీయ నాయకులు చెప్పేవన్నీ నిజం అవుతాయని అనినుకోవడం, ‘శ్రోతల’ అజ్ఞానం అనిపించుకుంటుంది. అదే సమయంలో రాజకీయ నాయకుల పద్ధతి మారదు. అందులోనూ మునిగి పోతున్న పడవలో ప్రయాణిస్తున్న రాజకీయ నాయకులు, భయంతో కూడిన బడయిని ప్రదర్శిస్తుంటారు. ఇక ఇప్పుడు విషయంలోకి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసేఆర్’ మళ్ళీ మరోసారి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు సంబంధించి చేస్తున్న ప్రకటనలు చెప్పేవాడికి వినేవాడు లోకువ సామెతను గుర్తుకు తెస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ఇప్పుడు కేసీఆర్ కొత్తగా రిబ్బన్ కట్’ చేసి ప్రారంబించిన కొత్త కార్యక్రమం కాదు. నిజానికి, స్వయంగా ఆయనే ఒకటి రెండు విఫల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆయనకంటే ముందే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యంత్రి మమతా బెనర్జీ అదే పనిలో ఉన్నారు. మరోవంక బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు ఏవీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అదే సమయంలో కేసీఆర్, కారణాలు ఎవైనా ఆయన ఆట అయన మొదలు పెట్టారు. అయితే, ఆయన చేస్తున్నకొత్త ప్రయత్నాలు ఇంకా గడప దాట లేదు కానీ, తెరాస నాయకుల ప్రకటనలు మాత్రం కేసీఆర్’కు దేశం బ్రహ్మరధం పడుతున్నాయనే విధంగా ఉంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా ప్రాంతీయ వాదాన్ని బుజానికి ఎత్తుకుని, ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీ జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరేయాలని అనుకోవడం అయితే అజ్ఞానం, కాదంటే అమాయకత్వం అని పించుకుంటుందని పరిశీలకు అంటున్నారు. అదే సమయంలో ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో వేగంగా జారిపోతున్న గ్రాఫ్’ను నిలుపుకునేందుకే కేసీఆర్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, సామాన్యులకు కూడా అర్థమై పోయిందని అంటున్నారు,
http://www.teluguone.com/news/content/kcr-national-politics-loop-holes-39-131949.html





