కల్వకుంట్ల కుటుంబానికి కవిత దూరం?
Publish Date:Aug 5, 2025
Advertisement
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో విభేదాలు ఇక ఇసుమంతైనా దాపరికం లేకుండా రచ్చకెక్కాయి. కేసీఆర్ కుమార్తె కవిత శషబిషలు లేకుండా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా బీఆర్ఎస్ ను, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆధర్ ను టార్టెట్ చేసి విమర్శలతో చెలరేగిపోతున్నారు. అంతే కాదు.. ఇక తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా మద్దతుగా గళమెత్తడానికి కూడా అమె పెద్ద సుముఖంగా లేరన్న సంకేతాలిస్తున్నారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునేందుకు వ్యూహరచన చేసేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ఆ సమావేశానికి కవిత దూరంగా ఉన్నారు. పార్టీ రానీయలేదా? ఆమె దూరం జరిగారా అన్నది పక్కన పెడితే.. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లోఅత్యంత కీలకంగా ఉన్న కవిత.. కీలకమైన కాళేశ్వరం విషయంలో పార్టీ వ్యూహరచనకు దూరం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేననీ, అక్రమాలకు కారకులు వీరే అంటే కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ నేత ఈటల పేర్లను కూడా కమిషన్ నివేదిక వెల్లడించినట్లు సమాచారం. ఈ నివేదక తెలంగాణలో కలకలం రేపుతుండగా, బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది. ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాం హౌస్ లో సోమవారం ( ఆగస్టు 4) పార్టీ కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కవిత దూరంగా ఉన్నారు. లేదా కేసీఆర్ దూరంగా ఉంచారు. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక భేటీ జరుగుతుంటే.. కవిత మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో నిరశన దీక్షలో కూర్చున్నారు. వాస్తవానికి కవిత మూడు రోజుల నిరశన దీక్ష ప్రకటించినప్పటికీ.. కోర్టు సూచనతో కవిత ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాళేశ్వరం నివేదికపై ఏమీ మాట్లాడలేదు. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ నివేదిక తో కేసీఆర్ అరెస్టు ఎదుర్కొంటున్నారన్న విషయాలను ఆమె ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపై తిరుగుబావుటా ఎగురవేసిన కవిత.. తండ్రి కేటీఆర్ కు కూడా దూరంగా ఉంటూనే తన సొంత బాటలో నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా కవిత.. కల్వకుంట్ల కుటుంబానికి దూరమయ్యారనడానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ఆమె మాట్లాడకపోవడమే తార్కానమని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/kavitha-distance-herself-with-kalvakuntla-family-39-203523.html





