గంప గోవర్ధన్ హ్యాట్రిక్ ఖాయమా?
Publish Date:Mar 9, 2012
Advertisement
హైదరాబాద్: కామారెడ్డి శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి గంప గోవర్ధన్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన ప్రచారంచేస్తూ గోవర్ధన్ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. గోవర్ధన్ ఇప్పటివరకు రెండుసార్లు కామారెడ్డి నుంచి గెలుపొందారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. గంప గోవర్ధన్ ఇప్పటికే రెండుసార్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఓడించారు. దీంతో మరోసారి ఇక్కడ పోటీచేయడానికి షబ్బీర్ అలీ వెనుకంజ వేశారు. గత్యంతరంలేక కాంగ్రెస్పార్టీ తమ అభ్యర్ధిగా యడ్ల రాజిరెడ్డిని రంగంలోకి దింపింది. రాజిరెడ్డి గతంలో జనసంఘ్ తరపున ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి మరోసారి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. టిడిపి నుంచి పోటీచేస్తున్న ఎన్. వేణుగోపాలరావు మొదటిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వేణుగోపాలరావు గత ఏడాది టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఎంతోకాలం నుంచి ఉంటున్న నేతలు ఇక్కడ పోటీచేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ వేరేమార్గం లేక వేణుగోపాలరావుకి టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులు బలహీనంగా ఉండటంతో టిఆర్ఎస్ విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kamareddy-24-12489.html





