జూపల్లిని టార్గెట్ చేస్తున్న మంత్రి అరుణ
Publish Date:Mar 8, 2012
Advertisement
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగుతుంది. ముఖ్యంగా రాష్ట్రమంత్రి డికె అరుణ నిన్న మొన్నటి వరకు తన మంత్రివర్గ సహచరుడిగా ఉన్న జూపల్లి కృష్ణారావుపై తీవ్రమైన వాక్భాణాలను సంధిస్తున్నారు. ఉన్న పదవితో సంతృప్తి చెందకుండా పెద్ద పదవికి కక్కుర్తిపడి చివరకు ఉన్న పదవిని కూడా పోగొట్టుకున్నారని ఆమె జూపల్లిపై విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగించబోయి జూపల్లి భంగపడ్డారని, గద్వాలతో తన ప్రతాపం చూపించుకోవడానికే గతంలో పాదయాత్ర చేశారని ఆమె ప్రచార సభల్లో అంటున్నారు. గద్వాల ప్రాంతంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇద్దరూ మంత్రులుగా ఉన్న సమయంలో కూడా ఈ విభేదాలు ఉండేవి. గద్వాలలో జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పాదయాత్రను గతంలో మంత్రి డికె అరుణ అడ్డుకున్నారు. దీంతో పార్టీ జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పింది.వ్యక్తిగతమైన కక్షతో డికె అరుణ తన ఇతర ప్రత్యర్దులయిన టిడిపి, బిజెపిలను వదిలేసి అభ్యర్ధి జూపల్లి కృష్ణారావుపైనే తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు. అయితే జూపల్లి కృష్ణారావు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన ప్రచారం తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన ఎక్కడా డికె అరుణను టార్గెట్ చేయడంలేదు.
ఇదిలా ఉండగా మంత్రి డికె అరుణ కొల్లాపూర్ నియోజకవర్గంలోని రేషన్ డీలర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జూపల్లి కృష్ణారావు పౌర సరఫరాల మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ డీలర్లను పెట్టిన ఇబ్బందులను ఆమె ఈ సమావేశంలో పదే పదే గుర్తుచేశారు. మళ్ళీ జూపల్లి గెలిస్తే రేషన్ డీలర్లకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. అందుకే రేషన్ డీలర్లు, వారి మద్దతుదారులు కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని ఆమె కోరారు.
http://www.teluguone.com/news/content/jupalli-krishnarao-24-12476.html





