జోగి మేఘన కారు ప్రమాదం.. యాక్సిడెంట్ కుట్ర.. తండ్రి సంచలన ఫిర్యాదు.!
Publish Date:Oct 23, 2026
Advertisement
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు అయింది. ఆయన కోడలు జోగి మేఘన ప్రయాణి స్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం వెనుక జోగి రమేష్ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ మేఘన తండ్రి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి కోదాడ వెళ్తుండగా ప్రమాదం.! ఈ నెల 15న మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతిన్నది.ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మేఘన తండ్రి కృష్ణ అక్టోబర్ 16న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రమాదం వెనుక ఉన్న కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. జోగి రమేష్‌తో పాటు మరికొందరి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామాల వెనుక కొన్ని నెలలుగా నడుస్తున్న కుటుంబ కలహాలు బలంగా ఉన్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తో వివాహం జరిగిన నాటి నుంచి తనను అదనపు కట్నం కోసం వేధించారని, హత్యాయత్నానికి సైతం పాల్పడ్డారంటూ మేఘన పోలీసులను ఆశ్రయించారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె గతంలోనే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో గృహహింస కేసు నమోదు చేయించారు. ఆ వివాదాలు, న్యాయపోరాటం ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూతురు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డారంటూ మేఘన తరఫు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పోలీసులు మాత్రం ఇది ప్రాథమిక విచారణలో కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగానే తేలిందని వెల్లడించారు. అయినప్పటికీ, ఫిర్యాదుదారుల ఆరోపణలు గత కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. బస్సు డ్రైవర్ ఎవరనే కోణంతో పాటు, ఆ సమయంలో అక్కడ జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఈ హైప్రొఫైల్ కేసులో పోలీసులు తదుపరి విచారణలో ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. [ Jogi Meghana, Jogi Ramesh, Car Accident, Ibrahimpatnam police, AP news, CM Chandrababu, Naralokesh, Home minister Anitha, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/jogi-meghana-43-235162.html





