రబీ పంటకు నీటికొరత, గోదావరి డెల్టా రైతుల ఆందోళన
Publish Date:Mar 12, 2012
Advertisement
రాజమండ్రి: గోదావరి డెల్టా కింద సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో వేసిన వరి పంటకు నీటి కొరత ఎదురవుతోంది. దీనితో రైతులు త్రీవ ఆందోళనలకు గురవుతున్నారు. రబీ పంట పొట్టదశకు చేరడంతో చేలకు నీరు ఎక్కువగా అవసరమవుతుంది. కానీ గోదావరి జలాల ప్రవాహం నానాటికి తగ్గిపోతుంది. గత నెలలో గోదావరిలో సహజ జలాల వృద్ధి 3000 క్యూసెక్కుల వరకు ఉండగా ఇప్పుడది 1500 క్యూసెక్కులకు పడిపోయింది. నిజానికి ప్రస్తుత రబీ సీజన్ కు 60 వేల శతకోటి ఘనపుటడుగుల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 10 వేల శతకోటి ఘనపుటడుగుల నీరు కూడా గోదావరి ద్వారా సరఫరా చేయలేకపోయారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరికి నీరు చేరే అవకాశం లేదు. దీంతో సీలేరు రిజర్వాయర్ నుంచి 36 వేల శతకోటి ఘనపుటడుగుల నీరును విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ అక్కడ కూడా నీటి లభ్యత తక్కువగా వుండటంతో ఇప్పటివరకు 17 వేల శతకోటి ఘనపుటడుగుల నీటిని మాత్రమే విడుదల చేయగలిగారు. దీంతో రబీ పంటకు నీటి సమస్య ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే చేతికి రావాల్సిన వరి పంట ఎండిపోయే పరిస్తితి ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jajamandry-24-12565.html





