ఇన్ చార్జ్ లు కావలెను.. జగన్ వెతుకులాట.. నేతల దోబూచులాట!
Publish Date:Jan 11, 2025
Advertisement
వైసీపీ పరిస్ధితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టు నాగంభోట్లుఅన్నట్లుగా తయారౌతోంది. ఏ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎప్పుడు పీకేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఛాదస్తపు మొగుడు చెబితే వినడు తిడితే ఏడుస్తాడు అన్నట్లుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆ పార్టీ నేతలే తలలుపట్టుకుంటున్న పరిస్థితి. అధికారంలో ఉండగా కన్నూమిన్నూగనక.. ఇక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామన్న గుడ్డి విశ్వాసంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు వైసీపీ వినా మరో గత్యంతరం లేక ఆ పార్టీలోనే ఉంటున్నారు. అలా కాకుండా కొద్దో గొప్పో పార్టీలో తామరాకు మీద నీటిబొట్టులా ఉండి.. ప్రత్యర్థులపై నోరు పారేసుకోని నేతలు వైసీపీని వదిలేసి కూటమి పార్టీల్లోకి దూకేశారు. ఆ దారిలో ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు. సంక్రాంతి తరువాత వైసీపీ నుంచి వలసలు పెద్ద సంఖ్యలో ఉంటాయనీ చెబుతున్నారు. ఇక రోజా, అంబటి, బుగ్గన, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి వంటి వారు వారి తీరు కారణంగా మరో పార్టీలోకి ప్రవేశం లేక.. గత్యంతరం లేక వైసీపీనే పట్టుకు వేళాడుతున్నారు.
ఇక గత ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ల కేటాయింపును జగన్ మోహన్ రోడ్డి అపహాస్యం చేసి పారేశారు. ఎలాంటి కారణం, హేతువు అన్నదే లేకుండా అభ్యర్థులను మార్చి పారేశారు. తన ఫొటో చూసే ఓట్లు పడతాయి, అభ్యర్థులు నిమిత్త మాత్రులు అన్నట్లుగా వ్యవహరించారు. అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నరసరావుపేటకు పంపేయడం, అలాగే రోజా, అంబటి వంటి వారికి అసలు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న సస్పెన్స్ లో ముంచి చివరి నిముషంలో టికెట్ కేటాయించడం వంటి ఫీట్లు ఎన్నో చేశారు. ఆయన ఏం చేసినా అప్పట్లో నేతలు నోరు మెపదకుండా ఉండడానికి మరోసారి జగన్ అధికారంలోకి వస్తారన్న విశ్వాసమే కారణమని వేరే చెప్పనవసరం లేదు.
తీరా గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి జగన్ అరాచక పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలలో అత్యధికులు సైలెంటైపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా, మిగిలిన వారిలో అత్యధికులు అటు పార్టీకీ, ఇటు ప్రజలకూ ముఖం చాటేసి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ఈ కోవలోకి వస్తారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది.
రాష్ట్రంలో దాదాపు 50కి పైగా నియోజకవర్గాలలో ఇప్పడు వైసీపీకి ఇన్ చార్జీలే లేరు. ఎవరినైనా నియమిద్దామని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆ పోస్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే వారే కరవయ్యారు. పోనీ కోరుకున్న వారికి ఆ పోస్టు ఇచ్చేయొచ్చు కదా అంటే అందుకు జగన్ అంగీకరించడం లేదు. కింద పడినా పై చేయి నాదే అంటున్న జగన్ తీరు చూసి నేతలు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఇన్ చార్జిలు ఉన్న నియోజకవర్గాలలో కూడా పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు క్యాడర్ ముందుకు రావడం లేదు. ఓ వైపు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతూ కోటి సభ్యత్వాల ల్యాండ్ మార్క్ చేరుకుంది. ఆ పార్టీ కార్యకర్తల కోసం బీమా కూడా చేయించింది. మరో వైపు వైసీపీ ఉన్న క్యాడర్ ను చేజార్చుకుంటోంది. దీంతో రానున్న రోజులలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-search-for--incharges-39-191209.html