జగన్ సామాజిక అన్యాయం!.. పలు కులాలు, జిల్లాలకు ద్రోహం!
Publish Date:Apr 10, 2022
Advertisement
కొత్త కేబినెట్‌తో సామాజిక న్యాయం కాదు.. తీవ్ర సామాజిక అన్యాయం జరిగిందంటూ అంతా మండిపడుతున్నారు. కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు మంత్రిమండలిలో చోటు దక్కకపోవడం సామాజిక కుంపటికి దారి తీస్తోంది. ఆయా వర్గాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. 25 మందితో ప్రకటించిన కొత్త కేబినెట్‌లో కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గాలకు మొండి చెయ్యి చూపారు జగనన్న. ఆయా వర్గాల నుంచి గతంలో మంత్రులుగా ఉన్నవారిని పక్కన పెట్టారు. కమ్మ కులం నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నానికి కేబినెట్‌లో మరోసారి అవకాశం దక్కలేదు. తాను కమ్మలకు బద్దశత్రువని చెప్పకనే చెప్పేశారు జగన్‌రెడ్డి. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న వెల్లంపల్లి సహా, ఏ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వలేదు. రోశయ్య మరణం, సుబ్బారావు గుప్తాపై దాడి నుంచి జగన్‌రెడ్డిపై మండిపడుతున్న వైశ్యులకు ఇప్పుడు మరోమారు జగన్ షాక్ ఇచ్చారు. ఇక, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఎపిసోడ్‌తో క్షత్రియ రాజులు జగన్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. అయినా, ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. గతంలో మంత్రిగా ఉన్న శ్రీరంగనాథరాజు సహా ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వలేదు. బ్రాహ్మణ సామాజికి వర్గానికి పాత, కొత్త కేబినెట్‌లలోనూ ప్రాతినిధ్యం లభించలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా వారికి అవకాశం ఇవ్వలేదు. నాలుగు కీలక సామాజిక వర్గాలకు మంత్రి పదవులు దక్కకపోవడంతో ఆయా సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్ కొత్త కేబినెట్‌లో 10 మంది బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు, ఎస్టీ సామాజికి వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కింది. పాత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారిని బుజ్జగించేందుకు వారిలో కొందరికి వివిధ పోస్టులు కల్పించాలని సీఎం నిర్ణయించారు. కొత్తగా స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును నియమించనున్నారు. ఆర్యవైశ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామికి ఛాన్స్ దక్కనుంది. 10 మంది సీనియర్లకు మళ్లీ మంత్రివర్గంలో స్థానం లభించింది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరి జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషాకు రెండోసారి కూడా అవకాశం వరించింది. అయితే, కొత్త కేబినెట్‌లో 8 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. కొన్నిజిల్లాల్లో ఇద్దరికి అవకాశం దక్కింది. చిత్తూరు జిల్లాలో ఏకంగా ముగ్గురికి ఛాన్స్ లభించింది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి, నారాయణస్వామిలను కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగించగా.. కొత్తగా ఆర్కే రోజాకు కేబినెట్‌లో అవకాశమిచ్చారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున అవకాశం దక్కింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరికి అవకాశం దక్కింది.
http://www.teluguone.com/news/content/jagan-new-cabinate-details-39-134184.html





